Regina Cassandra: డెమోక్రటిక్ సంఘకు రెజీనా గుడ్‌బై.. అసలేం జరిగింది

ABN , Publish Date - Nov 01 , 2026 | 01:46 PM

సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్న నటి రెజీనా కసాండ్రా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్న నటి రెజీనా కసాండ్రా (Regina Cassandra)అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న సామాజిక సంస్థ ‘డెమోక్రటిక్ సంఘ’ (Democratic Sangha)నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. కేవలం సభ్యురాలిగానే కాకుండా.. ఆ సంస్థ సహ వ్యవస్థాపకురాలిగా కూడా తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.  ఇంతకాలం సంస్థతో కలిసి పనిచేసిన రెజీనా.. ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? అనేది తెలియాల్సి ఉంది. 

సినిమా రంగంలో నటిగా గుర్తింపు తెచ్చుకున్న రెజీనా.. సామాజిక సేవా కార్యక్రమాలపై కూడా ప్రత్యేక ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే 2023లో డెమోక్రటిక్ సంఘతో ఆమె ప్రయాణం మొదలైంది. సామాజిక కార్యకర్త చైతన్య ఎంఆర్‌ఎస్‌కే ప్రారంభించిన ఈ సంస్థలో ఆమె సహ వ్యవస్థాపకురాలిగా బాధ్యతలు చేపట్టారు. ప్రజాస్వామ్య విలువలు, మానవ హక్కులు, మహిళా సాధికారత, పౌర విద్య, సామాజిక సంస్కరణలపై అవగాహన కల్పించడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యాలు. ఈ సంస్థ ద్వారా గ్రామీణ ప్రాంత మహిళల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించే కార్యక్రమాల్లో రెజీనా చురుగ్గా పాల్గొన్నారు. ముఖ్యంగా తెలంగాణలోని గ్రామీణ మహిళలకు ప్రజాస్వామ్యం, రాజ్యాంగ హక్కులు, ఆరోగ్యం, మహిళా హక్కులపై అవగాహన కల్పించే కార్యక్రమాలకు తనవంతు సహకారం అందించారు. గ్రామీణ మహిళలు తమ హక్కుల గురించి తెలుసుకోవడంతో పాటు సామాజిక మార్పులో భాగస్వాములు కావాలన్నది ఈ కార్యక్రమాల ఉద్దేశం. ఈ ప్రయాణంలో తన సినీ గుర్తింపును కూడా సామాజిక ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని ఆమె గతంలో పేర్కొన్నారు.

ఇప్పుడు ఎందుకీ నిర్ణయం?

శనివారం ఆమె సోషల్ మీడియా వేదిక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "ఎంతో ఆలోచించి, ఆత్మపరిశీలన చేసుకున్న తర్వాతే డెమోక్రటిక్ సంఘ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. ఈ సంస్థ నా జీవిత ప్రయాణంలో ఎంతో ముఖ్యమైన భాగం. దీనితో కలిసి పనిచేసిన సమయంలో ఎన్నో మంచి అనుభవాలు, స్నేహాలు, మధుర జ్ఞాపకాలు సొంతమయ్యాయి. ఈ సంస్థ స్థాపనలో భాగస్వామిని కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. దాని ఆశయాలు, కార్యక్రమాలకు నా వంతు సహకారం అందించే అవకాశం లభించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు జీవితంలో మరో మార్గంలో ముందుకు సాగుతూ, ఇతర ప్రాధాన్యతలపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది.  సహ వ్యవస్థాపకురాలిగా, సభ్యురాలిగా మాత్రమే కాకుండా సంస్థకు సంబంధించిన కార్యక్రమాల నుంచి కూడా తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన సహచరులు, స్నేహితులు, శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. వారితో కలిసి గడిపిన క్షణాలను, అనుభవాలను ఎప్పటికీ మర్చిపోలేను. డెమోక్రటిక్ సంఘ భవిష్యత్తు మరింత విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - Nov 01 , 2026 | 01:52 PM