మొన్న పవన్.. నేడు అర్జున్.. ఇదే కదా అసలైన హీరోయిజం అంటే
ABN , Publish Date - Jun 19 , 2026 | 09:33 PM
సాధారణంగా హీరోలు.. సినిమాల్లో హీరోయిజం చూపిస్తారు. పేదలకు హెల్ప్ చేస్తారు. బలహీనులకు అండగా ఉంటారు. ఎవరు ఏది కోరినా దాని కోసం ఏదైనా చేస్తారు.
సాధారణంగా హీరోలు.. సినిమాల్లో హీరోయిజం చూపిస్తారు. పేదలకు హెల్ప్ చేస్తారు. బలహీనులకు అండగా ఉంటారు. ఎవరు ఏది కోరినా దాని కోసం ఏదైనా చేస్తారు. ఇదే హీరోయిజం. అయితే ఇది కేవలం సినిమాల్లోనే మన హీరోలు చేస్తారు అనుకుంటే పోరపాటే. ఎందుకంటే.. మన టాలీవుడ్ హీరోలు కేవలం రీల్ హీరోలు మాత్రమే కాదు రియల్ హీరోలు కూడా. ఫ్యాన్స్ కోసం ఏది చేయడానికి అయినా టాలీవుడ్ హీరోలు రెడీగా ఉంటారు. ఒకప్పుడు హీరోలను కలవడం అసాధ్యమైనదిగా ఉండేది. కానీ, సోషల్ మీడియా వచ్చాక.. వారితో మాట్లాడడం, వారివద్దకు సమస్యలను చేర్చడం చాలా సులభంగా మారింది.
హీరోలకు పెద్దలే కాదు.. పిల్లలు కూడా అభిమానులే. అలాంటి చిన్నారులు అత్యంత క్రూరమైన వ్యాధులతో పోరాడుతుంటే.. వారి చివరి కోరికలు తమ అభిమాన హీరోలను కలవడమే అయితే.. ఆ కోరికలను తీర్చడానికి టాలీవుడ్ హీరోలు ఎప్పుడూ వెనుకడుగు వేయరు. వీలుంటే వెళ్లి కలవడం, లేకపోతే కనీసం వీడియో కాల్ లో అయినా మాట్లాడి వారి చివరి కోరికను నెరవేరుస్తున్నారు. ఇదేమి ఇప్పుడు మొదలయ్యింది కాదు. చిరంజీవి దగ్గర నుంచి రామ్ పోతినేని వరకు అందరూ తమ చిన్నారి అభిమానుల కోరికను తీర్చినవారే.
మొన్నటికి మొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. చిన్నారి అభిమాని నిరంజన్ కోరికను తీర్చడానికి ఆయన పనులు మానుకొని వరంగల్ వెళ్లి చిన్నారిని కలిసి ధైర్యం చెప్పారు. అంతేనా నిరంజన్ అడిగిన కుక్కపిల్లను గంటలోనే అతని చేతికి వచ్చేలా చేశారు. ఇక తాజాగా అల్లు అర్జున్ సైతం మామలానే తన చిన్న అభిమాని కోరికను తీర్చాడు. శ్రద్దా అనే చిన్నారి లుకేమియా క్యాన్సర్ తో బాధపడుతుంది. ఆమె అల్లు అర్జున్ కి పెద్ద ఫ్యాన్. తనకు చనిపోయేలోపు అల్లు అర్జున్ ని కలవాలని కోరిక. ఇదే విషయాన్ని ఆమె పేరెంట్స్ మేక్ ఏ విష్ అనే సంస్థకు తెలియజేయగా.. వారు బన్నీతో మాట్లాడి వీడియో కాన్ఫెరెన్స్ లో శ్రద్దాతో మాట్లాడించారు. బన్నీ సైతం చిన్నారి శ్రద్దాతో సంతోషంగా మాట్లాడాడు. పుష్ప లోని డైలాగ్ ని చిన్నారితో పాటు చెప్పించడమే కాకుండా హైదరాబాద్ కూడా రమ్మని ఆహ్వానించాడు. అంతేకాకుండా ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొన్న మామ.. నేడు అల్లుడు.. ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకున్నారు అని నెటిజన్స్.. ఇదిరా అసలైన హీరోయిజం అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.