Ntr: ఆ సంస్థతో తారక్‌కు సంబంధం లేదు.. టీమ్ క్లారిటీ
ABN , Publish Date - Jul 14 , 2026 | 03:02 PM
ఎన్టీఆర్ అభిమాన సంఘం పేరుతో ప్రచారం చేస్తూ, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ 'RAW NTR' సంస్థ గురించి ఎన్టీఆర్ టీమ్ స్పందించింది.
ఎన్టీఆర్ అభిమాన సంఘం పేరుతో ప్రచారం చేస్తూ, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ 'RAW NTR' సంస్థ గురించి ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ రాజకీయ రంగం ప్రవేశం, ఊరు-వాడ కార్యక్రమం అంటూ మంగళవారం ఓ లేఖ నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే! ఆ సంస్థతో ఎన్టీఆర్‌కు ఏ సంబంధం లేదని తారక్ వ్యక్తిగత బృందం అధికారికంగా ప్రకటించింది. ఎన్టీఆర్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తోన్న సంస్థకు తారక్‌కు ఎలాంటి సంబంధం లేదని ఓ లేఖ విడుదల చేశారు.
‘RAW NTR’ పేరుతో నిర్వహిస్తున్న కార్యకలాపాల గురించి మా దృష్టికి వచ్చాయి. ఆ సంస్థతో మాకెలాంటి సంబంధం లేదు. ఎన్టీఆర్‌తో సంబంధం ఉన్నట్లుగా ప్రజల్లో భావన కలిగించేలా ఆ సంస్థ వ్యవహరిస్తోంది. ఆయన తరఫున ప్రాతినిధ్యం వహించే హక్కు దానికి లేదు. ఎన్టీఆర్‌కు సంబంధించిన సేవా, ప్రజా సంక్షేమ కార్యక్రమాల వివరాలు కేవలం వ్యక్తిగత లేదా ఆయన అధికారిక బృందం ద్వారా మాత్రమే వెల్లడవుతాయి. అనధికార వ్యక్తులు, సంస్థలు ద్వారా జరిగే ప్రచారాన్ని పరిగణనలోకి తీసుకోకండి. అన్ని అపోహలు, వదంతులు, ఊహాగానాలకు ముగింపు పలుకుతారని ఆశిస్తున్నాం. డిజిటల్, సోషల్ మీడియా వేదికలు అభిమానులు, శ్రేయోభిలాషులు ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయకుండా అధికారిక వర్గాల ద్వారా విడుదలయ్యే సమాచారాన్నే నమ్మాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని ఎన్టీఆర్ కార్యాలయం నుంచి విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.
