Varun Tej: పెదనాన్నను దృష్టిలో పెట్టుకుని డ్యాన్స్ చేశా
ABN , Publish Date - Jul 19 , 2026 | 08:03 PM
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రానున్న ఈ హారర్-కామెడీ సినిమాని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) నటిస్తున్న తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’. మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వంలో రానున్న ఈ హారర్-కామెడీ సినిమాని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా, సత్య ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ఆదివారం అనంతపురంలో ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్ ‘రాసా గుమ్మాడి’ పాటను అభిమానుల సమక్షంలో విడుదల చేశారు.
వరుణ్ తేజ్ మాట్లాడుతూ 'కాలికి గాయం వల్ల చాలా రోజులు బయటకు రాలేదు. ఇప్పుడు ఇలా మీ అందరినీ చూస్తుండటం ఆనందంగా ఉంది. ‘కొరియన్ కనకరాజు’ చిత్రీకరణ అనంతపూర్‌లోనే జరిగింది. అందుకే ఈ పాటను ఇక్కడే రిలీజ్ చేయాలని అనుకున్నాం. మీ అందరికీ ఈ పాట నచ్చిందని ఆశిస్తున్నాను. పెదనాన్న గారిని దృష్టిలో పెట్టుకుని డ్యాన్స్ చేశాను. ఈ సినిమాను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. ఇక్కడ స్టేజ్ మీద డ్యాన్స్ వేయాలని ఉంది. కానీ కాలికి గాయం ఇంకా తగ్గలేదు. ఆగస్ట్ 7న సినిమా రాబోతోంది. అందరినీ ఎంటర్టైన్ చేసేలా ఉంటుందని భావిస్తున్నాను' అన్నారు.
మేర్లపాక గాంధీ మాట్లాడుతూ ‘కొరియన్ కనకరాజు’లో మాస్‌కి నచ్చే ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఈ పాటను అనంతపూర్‌లో రిలీజ్ చేయాలని వరుణ్ చెప్పారు. ఇక్కడి బ్యాక్ డ్రాప్‌తోనే ఈ మూవీని చేస్తున్నాం' అని అన్నారు.