కోట శ్రీనివాసరావుకు.. ఆస్కార్ ఘ‌న నివాళి!

ABN , Publish Date - Mar 17 , 2026 | 05:50 AM

ఆదివారం రాత్రి అట్టహాసంగా జ‌రిగిన‌ ఆస్కార్‌ అవార్డ్స్‌ వేడుకలో సినీ రంగంలో ఎంతో రాణించి, కన్ను మూసిన హాలీవుడ్‌, భారతీయ సినీ దిగ్గజాలను స్మరించుకోవడం అందరినీ ఆకట్టుకుంది.

Oscars, Kota Srinivasa Rao

ప్రపంచ సినీ రంగం.. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన 98వ ఆస్కార్‌ అవార్డుల వేడుక (98th Oscars Academy Awards) కన్నుల పండువగా సాగింది. లాస్‌ఏంజిల్స్‌(అమెరికా)లోని డాల్బీ థియేటర్‌లో ఆదివారం సాయంత్రం (భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం) జరిగిన ఈ కార్యక్రమానికి కోనన్‌ ఓబ్రియాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. గతేడాది హిందీ భాషలో ‘భోజనం చేశారా’ అని సందడి చేసిన ఆయన.. ఈ సారి కృత్రిమమేథపై జోకులు పేల్చి అందర్నీ ఆలోచింపజేశారు. ఎప్పటిలాగే ఈ ఏడాదీ, ఎన్నో చిత్రాలు, ఎంతోమంది నటీనటులు.. సాంకేతిక బృందాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. ‘వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌’ చిత్రం ఆరు అవార్డులతో సత్తా చాటగా.. ‘సిన్నర్స్‌’.. నాలుగు.. ఫ్రాంకెన్‌స్టైయిన్‌ మూడు పురస్కారాలు సాధించాయి.

కోటను స్మరించుకున్న ఆస్కార్‌ వేదిక

ఆదివారం రాత్రి ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన ఆస్కార్‌ అవార్డ్స్‌ వేడుకలో సినీ రంగంలో ఎంతో రాణించి, విశేష సేవలు అందించి, కన్ను మూసిన హాలీవుడ్‌, భారతీయ సినీ దిగ్గజాలను స్మరించుకోవడం అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా గత ఏడాది మరణించిన తెలుగు నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao)ను, నటి బి.సరోజాదేవి, బాలీవుడ్‌ నటులు ధర్మేంద్ర, మనోజ్‌కుమార్‌ లను గుర్తు చేసుకుని వారికి నివాళి ఘటించడం గమనార్హం.

అలాగే ఈ సందర్భంగా రూపొందించిన వీడియోను వేదికపై ప్రదర్శించారు. అయితే ఇందులో ధర్మేంద్రను చూపించక పోవడంతో ఆయన సతీమణి హేమమాలిని, ధర్మేంద్ర అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సమయాభావం వల్ల వీడియోలో కొందరినే చూపించామనీ, అందరి పేర్లు అస్కార్స్ ఇన్ మెమోరియ‌మ్ (https://www.oscars.org/in-memoriam/2026) వెబ్‌ సైట్‌లో ఉంచామని ఆస్కార్‌ కమిటీ సభ్యులు వెల్లడించారు.

Updated Date - Mar 17 , 2026 | 06:13 AM