‘రావు బహదూర్’.. తెలుగు సినిమాకు రాసిన ప్రేమలేఖ అని మహేశ్‌బాబు ప్రశంసించారు
ABN , Publish Date - Jul 01 , 2026 | 10:03 AM
రావు బహదూర్’ చిత్రంపై మహేశ్‌బాబు చేసిన ప్రశంసలు తమకు ఎంతో ఆనందాన్నిచ్చాయని హీరో సత్యదేవ్ అన్నారు.
‘రావు బహదూర్’ (Rao Bahadur ) వంటి కొత్త తరహా చిత్రాలని ప్రోత్సహించడానికి హీరో మహేశ్‌బాబు (Mahesh Babu) ఎప్పుడూ ముందుంటారు. ‘రావు బహదూర్’ను ‘తెలుగు సినిమాకు రాసిన ప్రేమలేఖ.. మునుపెన్నడూ చూడని చిత్రం’ అని ఆయన ప్రశంసించడం ఎంతో ఆనందాన్నిచ్చింది’ అని హీరో సత్యదేవ్ (Satyadev) అన్నారు. ఆయన కథానాయకుడిగా వెంకటేశ్ మహా (Venkatesh Maha) తెరకెక్కించిన చిత్రమిది.
జీఎమ్‌బీ (GMB) ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్‌బాబు, నమత్రా శిరోద్కర్ సమర్పించారు. ఏ ప్లస్ ఎస్ సినిమాస్, శ్రీచక్రాస్ (Sri Chakraas) ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్లపై చింతా గోపాల కృష్ణారెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మించారు. ఈ నెల 3న సినిమా విడుదలవుతుండడంతో ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘మోర్ దన్ ఏ టీజర్’ పేరుతో సాగిన ఈ ట్రైలర్‌కు మహేశ్‌బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం.
‘డ్రామా మొదలైనప్పుడు లాజిక్ ముగుస్తుంది’.. ‘డ్రామాకు మ్యాజిక్ కలిస్తే, లాజిక్‌కు కొత్త అర్థం పుడుతుంది’, ‘ఇక్కడ మ్యాజిక్ అంటే గారడి కాదు.. దృశ్యకావ్యం’ అంటూ ఈ చిత్రం ప్రపంచాన్ని ఆయన పరిచయం చేసిన విధానం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో వెంకటేశ్ మహా మాట్లాడుతూ ‘ఇది తెలుగు సినిమా కిరీటంలో మరో కలికితురాయి అవుతుంది. ప్రేక్షకులకు చాలా కాలం పాటూ గుర్తుండిపోతుంది. తెలుగు సినిమా గొప్పదనాన్ని మరింత పెంచుతుంది’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు చింతా గోపాల కృష్ణారెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, హీరోయిన్ ధీపా థామస్ పాల్గొన్నారు.