వెంకీ 'ఆదర్శ కుటుంబం'లోకి.. రంగస్థలం బ్యూటీ?
ABN , Publish Date - Apr 30 , 2026 | 04:18 PM
విక్టరీ వెంకటేష్ (Venkatesh) సినిమా వస్తుందంటే చాలు.. అది పక్కా ఫ్యామిలీ పండగే అని సినీ ప్రేక్షకులు భావిస్తారు.
విక్టరీ వెంకటేష్ (Venkatesh) సినిమా వస్తుందంటే చాలు.. అది పక్కా ఫ్యామిలీ పండగే అని సినీ ప్రేక్షకులు భావిస్తారు. దానికి తోడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వం తోడైతే, ఆ మ్యాజిక్ బాక్సాఫీస్ వద్ద మరో స్థాయిలో ఉంటుంది. గతంలో వీరిద్దరి కలయికలో 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు వచ్చినప్పటికీ, ఆ చిత్రాలకు త్రివిక్రమ్ కేవలం రచయితగా మాత్రమే పనిచేశారు. దర్శకుడిగా వెంకటేశ్‌తో ఆయన చేస్తున్న తొలి సినిమా ఇదే.
దీంతో ఈ సినిమా ఆరంభం నుంచే సినీ ప్రేక్షకులతో పాటు వెంకీ అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.. తాజాగా ‘ఆదర్శ కుటుంబం’ గురించి ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ వినిపిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్టులో రామ్ చరణ్ రంగస్థలం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ చిత్రంలోని ప్రత్యేక పాటతో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు నటి పూజిత పొన్నాడ (Pujita Ponnada) ఒక కీలక పాత్రలో మెరవబోతున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో పూజిత కేవలం ఒక సహాయక పాత్రకే పరిమితం కాకుండా, ఈ సినిమాలో సర్‌ఫ్రైజ్ రోల్‌లో నటిస్తున్న హీరో నారా రోహిత్ (Nara Rohith) కు జోడీగా కనిపించనుందని టాక్ నడుస్తోంది. త్రివిక్రమ్ సినిమాల్లో కేవలం హీరో హీరోయిన్లే కాకుండా, ప్రతి సపోర్టింగ్ క్యారెక్టర్‌కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు, ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఈ చిత్రంలో నారా రోహిత్ - పూజితల ట్రాక్ కూడా కథలో చాలా కీలకంగా ఉండబోతుందని సినీ వర్గాల అంచనా. ఇది పూజిత కెరీర్‌కు ఖచ్చితంగా ఒక పెద్ద ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చాలా సైలెంట్‌గా, పక్కా ప్లానింగ్‌తో జరుగుతోంది. ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) ఈ సినిమాలో ప్రధాన కథానాయికగా నటిస్తోంది. వాస్తవానికి ఈ చిత్రం సమ్మర్ రిలీజ్ రేస్ నుంచి తప్పుకున్నప్పటికీ, అవుట్ పుట్ విషయంలో దర్శకుడు త్రివిక్రమ్ ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదని తెలుస్తోంది. నాణ్యత కోసం ఎంత సమయమైనా తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. దీనివల్ల సినిమా పక్కాగా రూపొందుతుందనే నమ్మకం నిర్మాతల్లో కనిపిస్తోంది.
అయితే.. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఉన్న హర్షవర్ధన్ రామేశ్వర్ స్థానంలో తమన్ వచ్చాడని ఇటీవల బాగా న్యూస్ వైరల్ అయినప్పటికీ అవి కేవలం పుకార్లే అని తేలింది. హారికా హాసిని ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. వెంకటేష్ కామెడీ టైమింగ్, త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగులు కలిసి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాయో చూడాలి. ఈ కాంబినేషన్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.