రణబాలి పాత్ర వెనుక ఉన్న అసలు వీరులు వీళ్లే..

ABN , Publish Date - Oct 02 , 2026 | 06:09 PM

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా, దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ డ్రామా రణబాలి

Ranabaali

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా, దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ డ్రామా రణబాలి (Ranabaali). మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 16 న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ స్పీడు పెంచిన మేకర్స్.. రణబాలి మేకింగ్ వీడియోలను డాక్యుమెంటరీ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఆ వీడియోలలో అసలు ఈ కథ వెనుక నిజాలు ఏంటి.. ? అనేది డైరెక్టర్, హీరో, హీరోయిన్ చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే రెండు పార్ట్స్ ని రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా ట్రూత్ 3 - ది మ్యాన్ వి ఫర్ గాట్ వీడియోని రిలీజ్ చేశారు.


ఇక ఈ వీడియోలో విజయ్ దేవరకొండ పోషిస్తున్న సింగనమల బొబ్బిలి రణబాలి పాత్ర వెనుక ఉన్న అసలు కథను దర్శకుడు వెల్లడించాడు. రాయలసీమ గడ్డపై పుట్టిన కొందరు వీరులను, పాలెగాళ్లను ఉద్దేశపూర్వకంగానే చరిత్ర పుస్తకాల్లో మర్చిపోయేలా చేశారని దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఆవేదన వ్యక్తం చేశాడు. గుర్రపు స్వారీ చేస్తూ, దేవతలతో మాట్లాడే శక్తి ఉండి, బ్రిటిష్ పాలనా వ్యవస్థపై తిరుగుబాటు చేసిన గాడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి లాంటి ధీరుల నుంచి ప్రేరణ పొంది ఈ రణబాలి పాత్రను తీర్చిదిద్దినట్లు ఆయన పేర్కొన్నాడు.


అంతేకాకుండా, రాయలసీమలో కరవు వచ్చినప్పుడు తన ఆస్తిపాస్తులన్నీ అమ్మేసి గంజి కేంద్రాలు ఏర్పాటు చేసి వేలాది మంది ప్రాణాలను కాపాడిన మానవతావాది బుడ్డా వెంగళరెడ్డి నుంచి ఈ పాత్రలోని భావోద్వేగాలను తీసుకున్నట్లు తెలిపారు. అలాగే బ్రిటిష్ సైన్యాన్ని నడిరోడ్డుపై గడగడలాడించిన విప్లవ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తెగువను కూడా రణబాలి క్యారెక్టర్‌లో మేళవించినట్లు దర్శకుడు స్పష్టం చేశాడు. తాను రాయలసీమలోనే పుట్టి పెరగడం వల్ల అక్కడ చూసిన మాస్, తెగువ ఉన్న వ్యక్తుల నైజమే విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్‌కు ప్రధాన కారణమని తెలిపాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక రాహుల్ సాంకృత్యన్ అద్భుతమైన విజువల్స్, విజయ్ దేవరకొండ గెటప్ ప్రేక్షకుల్లో అంచనాలను రెట్టింపు చేశాయి. మరి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Oct 02 , 2026 | 06:09 PM