రామోజీరావు మనవడిని చూశారా.. అచ్చం సుమన్ లానే ఉన్నాడే
ABN , Publish Date - Aug 31 , 2026 | 07:27 PM
తెలుగు బుల్లితెర చరిత్రలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి, ఎన్నో కుటుంబ కథా చిత్రాలు, ధారావాహికలతో వీక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన దివంగత చెరుకూరి సుమన్ (Suman) జ్ఞాపకాలు మరోసారి సజీవమయ్యాయి.
తెలుగు బుల్లితెర చరిత్రలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి, ఎన్నో కుటుంబ కథా చిత్రాలు, ధారావాహికలతో వీక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన దివంగత చెరుకూరి సుమన్ (Suman) జ్ఞాపకాలు మరోసారి సజీవమయ్యాయి. ఈటీవీలో ప్రసారం అవుతున్న ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2 ప్రత్యేక కార్యక్రమానికి ఈటీవీ సంస్థల వ్యవస్థాపకులు దివంగత రామోజీరావు మనవడు, సుమన్ కుమారుడు సుజయ్ చెరుకూరి ప్రత్యేక అతిథిగా హాజరై సందడి చేశాడు.
ఈ వేదికపై ఆయన తన తండ్రి సుమన్ తో, తాత రామోజీరావు తో తనకున్న మధురమైన జ్ఞాపకాలను పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. 'నాన్నగారు ప్రతీ సినిమాను ఎంతో ఎమోషనల్‌గా చేసేవారు. ఆయన సినిమాల్లో ఫైట్స్ తక్కువగా ఉండటంతో.. నాన్నగారూ, మీరు కూడా రౌడీలను కొట్టేలా ఒక మాస్ ఫైట్ చేయొచ్చు కదా అని అడిగేవాడిని. దానికి ఆయన నవ్వుతూ సరేరా.. నీకోసం ఒక మంచి యాక్షన్ కథ రాస్తాను అని చెప్పేవారు' అని గుర్తు చేసుకున్నాడు.
అలాగే తాత రామోజీరావుతో చిన్నతనంలో తాను కాసిన సరదా పందెం ముచ్చట్లను కూడా పంచుకున్నాడు. 'మా ఇద్దరి మధ్య ఒక ఆసక్తికరమైన పందెం నడిచేది. ఆయన సంభాషణలో ఏదైనా ఇంగ్లీష్ పదం వాడితే నాకు 10 రూపాయలు ఇవ్వాలి. ఒకవేళ నేను ఇంగ్లీష్ పదం వాడితే తాతగారికి 5 రూపాయలు ఇవ్వాలి. అలా తాతగారితో పందెం కాస్తూనే నేను అనేక కొత్త తెలుగు పదాలను నేర్చుకున్నాను' అని తెలపడంతో ప్రాంగణమంతా ఆనందంతో నిండిపోయింది.
ఈటీవీని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో సుమన్ వహించిన పాత్రను, ఆయన బహుముఖ ప్రజ్ఞను ఈ సందర్భంగా తోటి నటీనటులు, సాంకేతిక నిపుణులు కొనియాడారు. ఆయన వేసిన బాటలోనే నేడు ఈటీవీ సరికొత్త కంటెంట్‌తో ముందుకు సాగుతోందని నివాళులర్పించారు. రామోజీరావు మనవడు ఈటీవీ కుటుంబ సభ్యులతో కలిసి వేదికను పంచుకోవడమే కాకుండా, తన కుటుంబం తరఫున ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామోజీరావు మనవడు సుజయ్.. అచ్చం సుమన్ లానే ఉన్నాడని కామెంట్స్ పెడుతున్నారు.