Cinema: పెన్ స్టూడియోస్ తో రమేశ్ వర్మ ఒప్పందం...
ABN , Publish Date - Jan 17 , 2026 | 02:49 PM
ప్రముఖ దర్శక నిర్మాత రమేశ్ వర్మ బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ తో ఓ భారీ డీల్ ను చేసుకున్నారు. ఇందులో భాగంగా ఆయన అజయ్ దేవ్ గన్ తో పాటు విక్రమ్, ధ్రువ్, లారెన్స్ తో ఆయన నాలుగు సినిమాలు చేయబోతున్నారు.
యువ దర్శక నిర్మాత రమేశ్ వర్మ ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థతో ఓ భారీ డీల్ ను కుదుర్చుకున్నారు. పబ్లిసిటీ డిజైనర్ గా చిత్రసీమలోకి అడుగుపెట్టిన రమేశ్ వర్మ అంచలంచెలుగా ఎదుగుతూ దర్శకుడిగా మారారు. పలు విజయవంతమైన చిత్రాలను రూపొంచారు. అలానే నిర్మాతగానూ మారారు. ప్రస్తుతం ఆయన 'కొక్కొరొకో' పేరుతో సినిమాను నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా సమ్మర్ స్పెషల్ గా జనం ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే రమేశ్ వర్మ బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ తో ఏకంగా నాలుగు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఈ నాలుగు సినిమాల బడ్జెట్ సుమారుగా రూ 150 కోట్లని అంటున్నారు. ఇందులో కోలీవుడ్ స్టార్ విక్రమ్ అతని కొడుకు ధ్రువ్, లారెన్స్, బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గన్ లతో రమేశ్ వర్మ సినిమాలు చేయాల్సి ఉంది. ఈ సినిమాలకు సంబంధించిన కథలు కూడా ఇప్పటికే ఫైనల్ అయ్యాయని, త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు. ఈ నాలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్సే నని తెలుస్తోంది. వీటికి సంబంధించిన టైటిల్స్, టెక్నికల్ టీమ్ వివరాలను సైతం త్వరలో రివీల్ చేస్తారు. నిజానికి రమేశ్ వర్మతో పెన్ స్టూడియోస్ సంస్థ పది ప్రాజెక్ట్స్ ను ప్లాన్ చేసిందట. తొలి విడతగా నాలుగు సినిమాలు ఖరారు అయ్యాయని చెబుతున్నారు. ఇదిలా ఉంటే... బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన 'కిల్' సినిమా రీమేక్ పనుల్లో రమేశ్ వర్మ బిజీగా ఉన్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయ్యిందని ఆయన తెలిపారు.