'వారణాసి'లో రామాయణం.. ఆ సన్నివేశాలన్నీ ఇక్కడే!
ABN , Publish Date - Feb 27 , 2026 | 06:59 AM
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి రాజమౌళి వారణాసి సినిమాను ఒక అద్భుత దృశ్యకావ్యంగా తీర్చిదిద్దుతున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో వస్తున్న గ్లోబల్ ప్రాజెక్ట్ వారణాసి (Varanasi). అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం, భారతీయ సినిమా రికార్డులను తిరగరాయడమే లక్ష్యంగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి రాజమౌళి ఈ సినిమాను ఒక అద్భుత దృశ్యకావ్యంగా తీర్చిదిద్దుతున్నారు.
ఈ ప్రతిష్టాత్మక సినిమా కోసం రాజమౌళి సాంకేతికత విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదు. హాలీవుడ్ తరహాలో మన దగ్గరే ఒక భారీ మోషన్ పిక్చర్ టెక్నాలజీ స్టూడియోను ఆయన ఏర్పాటు చేయించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఈ సెటప్‌లో సినిమాకు సంబంధించిన అత్యంత కీలకమైన సన్నివేశాలను ఇప్పటికే చిత్రీకరించినట్లు సమాచారం.
ఈ స్పెషల్ స్టూడియోలో షూట్ చేసిన మేజర్ పోర్షన్ దేనికి సంబంధించింది అనే విషయంలో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇటీవల విడుదలైన ఒక వీడియో ద్వారా ఇది "రామాయణ" ఎపిసోడ్‌కు సంబంధించినదని స్పష్టమైంది. ఆ వీడియోలో కొందరు నటీనటులు మోషన్ కాప్చర్ సూట్లు ధరించి, చేతిలో గదాదండం పట్టుకుని కనిపించడం ఈ వార్తకు బలాన్ని చేకూరుస్తోంది.
దీనిని బట్టి చూస్తుంటే "వారణాసి"లో రామాయణ ఘట్టానికి సంబంధించిన యుద్ధ సన్నివేశాలు ఎంత కీలకమో అర్థమవుతోంది. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించి వానర సైన్యాన్ని, వారి యుద్ధ తంత్రాన్ని వెండితెరపై ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి మార్కు ఎమోషన్స్ తో కూడిన ఈ యాక్షన్ బ్లాక్‌లు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనున్నాయి.
ఇక మహేష్ బాబు కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్, ఛాలెంజింగ్ రోల్ అని చెప్పవచ్చు. రాజమౌళి విజన్ కు తగ్గట్టుగా మహేష్ బాబు తనను తాను కొత్తగా మలచుకున్నారు. గ్లోబల్ ఆడియన్స్‌ను అలరించేలా ఈ రామాయణ యుద్ధ సీక్వెన్స్‌లను రాజమౌళి ఏ స్థాయిలో ప్రెజెంట్ చేస్తారోనని ఇటు టాలీవుడ్‌తో పాటు అటు హాలీవుడ్ వర్గాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి.
మొత్తానికి "వారణాసి" కేవలం ఒక సినిమా మాత్రమే కాకుండా, భారతీయ సాంకేతిక ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పే ప్రాజెక్టుగా నిలవనుంది. వానర సైన్యంతో కూడిన ఆ యాక్షన్ విజువల్స్ థియేటర్లలో ఏ రేంజ్ విధ్వంసం సృష్టిస్తాయో చూడాంటే వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తేదీ వరకు ఎదురుచూడాల్సిందే.