'వారణాసి' కొత్త అప్డేట్ వ‌చ్చింది.. ఇక పూన‌కాలే

ABN , Publish Date - Apr 04 , 2026 | 08:31 PM

బాలీవుడ్‌ మోస్ట్‌ అవైటెడ్ మూవీ 'రామాయణ' గ్లింప్స్ వచ్చిన తర్వాత అందరూ 'వారణాసి' గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. 'రామాయణ' చిత్రాన్ని 'వారణాసి'తో పోల్చుతున్నారు.

Varanasi Movie

ప్రస్తుతం ఇండియాస్‌ మోస్ట్‌ ఎవైటింగ్‌ ప్రాజెక్ట్‌లలో ముందువరుసలో ఉన్న చిత్రం వారణాసి. వెండితెర అద్భుతాల సృష్టికర్త రాజమౌళి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దాదాపు 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి చిన్న అప్‌డేట్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చింది..?

వారణాసి షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందా అని అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే 70 శాతం వరకు పూర్తయిందట. ఇప్పటివరకూ ఒరిస్సా, కెన్యాలోని దట్టమైన అడవులు, అంటార్కిటికా మంచు కొండలు, హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్లలో షూటింగ్ జరుపుకుంది. యాక్షన్, అడ్వెంచర్ వంటి అంశాలతో పాటు మైథాలజీ టచ్ కూడా ఉండటంతో ప్రతి సీన్ చాలా రిచ్‌గా వస్తోందని సమాచారం. మిగిలిన 30 శాతం షూటింగ్ కోసం చిత్ర బృందం ప్రస్తుతం హైదరాబాద్‌లో సిద్ధం చేసిన కాశీ సెట్‌లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించే పనిలో ఉంది. ఈ షెడ్యూల్‌లో మహేష్‌, ప్రియాంక చోప్రాతో పాటు, పృద్వీరాజ్‌ సుకుమారన్‌ కూడా పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ షెడ్యూల్ తర్వాత చిత్ర యూనిట్ ఒక చిన్న సమ్మర్ బ్రేక్ తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎండల తీవ్రత దృష్ట్యా షూటింగ్‌కు కాస్త విరామం ఇచ్చి, ఆ తర్వాత పెండింగ్‌లో ఉన్న కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నారు. ఈ గ్యాప్‌లో షూట్ చేసిన ఫుటేజ్‌ను ఎడిటింగ్ టేబుల్ మీద చెక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.


అయితే, ఈ చిత్రంలో మహేష్ బాబు రాముడి పాత్రలో కొద్ది సేపు కనిపించబోతున్నాడనే దానిపై క్లారిటీ ఇచ్చారు. ఎవరూ ఊహించని విధంగా, మునుపెన్నడూ చూడని రీతిలో సూపర్ స్టార్ మేకోవర్ ఉండబోతోంది. కేవలం లుక్ మాత్రమే కాదు, మహేష్ బాడీ లాంగ్వేజ్ కూడా ఈ సినిమా కోసం కంప్లీట్‌గా మారిపోయిందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. బాలీవుడ్ నుంచి వస్తున్న రామాయణ టీజర్ రీసెంట్‌గా విడుదలైంది.

అయితే ఆ టీజర్‌కు మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తుండటంతో, నెటిజన్లు వెంటనే వారణాసి ప్రీ-గ్లింప్స్‌తో పోల్చడం మొదలుపెట్టారు. రిలీజై 5 నెలలవుతున్నా వారణాసి గ్లింప్స్ ఇంకా ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. ఈ రెండింటి మధ్య జరుగుతున్న పోలికలు ప్రస్తుతం సినీ ప్రియుల మధ్య హాట్ టాపిక్ అయ్యాయి. జక్కన్న విజువల్స్ ముందు వేరే ఏ సినిమా అయినా దిగదుడుపే అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా, రాజమౌళి - మహేష్ కాంబో అంటే అది కేవలం సినిమా మాత్రమే కాదు, ఒక విజువల్ వండర్ అని ప్రతి ఒక్కరికీ బాగా తెలిసిన విషయమే. మరి వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న విడుదల కాబోతున్న వారణాసి వెండితెరపై ఎన్ని అద్భుతాలు చేస్తుందో చూడాలి.

Updated Date - Apr 04 , 2026 | 08:37 PM