ద లోన్ ఊల్ఫ్ గా రామ్ పోతినేని...
ABN , Publish Date - Apr 20 , 2026 | 12:21 PM
రామ్ పోతినేని హీరోగా నటించబోతున్న కొత్త చిత్రానికి 'ద లోన్ ఊల్ఫ్' అనే పేరు ఖరారు చేస్తున్నట్టు తెలుస్తోంది. రామ్ కథను కూడా అందిస్తున్న ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అనేది తెలియాల్సి ఉంది.
రామ్ పోతినేని (Ram Pothineni) గత కొంతకాలంగా మంచి విజయం కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రయోగాత్మకంగానే కాదు... కమర్షియల్‌గానూ రామ్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ బరిలో ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నాయి. అయినా ఏదో రకంగా విజయం దక్కకపోతుందా అని రామ్ తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు.
అందుకోసం మొన్న తన 'ఆంధ్రా కింగ్ తాలూకా' 'సినిమా కోసం పాట రాసిన రామ్ ఇప్పుడు ఏకంగా కథే తయారు చేసుకున్నాడు. ఈ సినిమాను లోకేష్ కనకరాజ్ శిష్యుడు లోకి విఘ్నేష్ దర్శకత్వంతో తెరకెక్కించ బోతున్నారని మొన్నటి వరకూ ఓ వార్త ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొట్టింది. కాకపోతే... బాగా డెప్త్ ఉన్న ఈ కథను మొదటిసారి మెగాఫోన్ పడుతున్న విఘ్నేష్ డీల్ చేయలేడేమోననే సందేహంతో అతన్ని పక్కన పెట్టేశారట. అయితే ఈ ఇప్పుడీ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారనేది ఇంకా ఫైనల్ కాలేదట. కానీ... ఈ ప్రాజెక్ట్ కోసం ఓ టైటిల్‌ను ఇప్పటికే రిజిస్టర్ చేశారని తెలుస్తోంది. 'ది లోన్ ఊల్ఫ్' (The Lone Wolf) అనే పేరును ఫిల్మ్ ఛాంబర్‌లో రిజిస్టర్ చేశారట. వరుస పరాజయాలు ఎదురైనా మడమ తిప్పకూడదనే కృతనిశ్చయంతో రామ్ ఉన్నాడు. అందుకే పరాజయాలతో కృంగిపోకుండా పట్టుదలతో ముందుకు సాగుతున్నాడు. మరి ఈ 'ది లోన్ ఊల్ఫ్' అయినా అతన్ని సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి.