Ram Pothineni: వరుస ప్లాపులు.. డైరెక్టర్ గా మారిన హీరో

ABN , Publish Date - May 04 , 2026 | 02:12 PM

దేవదాసుతో వెండితెరకు పరిచయమైన ఒక కుర్రాడు.. తన ఎనర్జీతో, డ్యాన్స్‌తో, యాక్టింగ్‌తో టాలీవుడ్‌ను ఊపేశాడు. అతనే మన ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni).

Ram Pothineni

Ram Pothineni: దేవదాసుతో వెండితెరకు పరిచయమైన ఒక కుర్రాడు.. తన ఎనర్జీతో, డ్యాన్స్‌తో, యాక్టింగ్‌తో టాలీవుడ్‌ను ఊపేశాడు. అతనే మన ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni). లవర్ బాయ్‌గా అమ్మాయిల మనసు గెలిచిన రామ్, ఇస్మార్ట్ శంకర్ తో మాస్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. కానీ, గడిచిన కొంతకాలంగా రామ్ కెరీర్ ఒక విచిత్రమైన సందిగ్ధంలో పడింది. వరుస ప్లాపులు.. అంచనాలు తప్పిన లెక్కలు. ఇప్పుడు వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు రామ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.


రామ్ కెరీర్‌ను ఒకసారి గమనిస్తే.. అటు క్లాస్ సినిమాలతో పాటు, మాస్‌ సినిమాలతోనూ సత్తా చాటుకున్నారు. ఇక కరోనా కు ముందు వచ్చిన ఇస్మార్ట్ శంకర్ రామ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ మైల్‌స్టోన్‌గా నిలిచింది. పూరీ జగన్నాథ్ మార్క్ మేనరిజమ్స్‌తో రామ్ ఊరమాస్ అవతారంలో అదరగొట్టాడు. కానీ ఆ తర్వాత వచ్చిన రెడ్, ది వారియర్, స్కంద, చివరకు డబుల్ ఇస్మార్ట్ కూడా ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయాయి. రీసెంట్ మూవీ ఆంధ్రా కింగ్ కథ పరంగా బాగుందని ప్రశంసలు దక్కించుకున్నా, కమర్షియల్‌గా రామ్‌కు కావాల్సిన పెద్ద బ్రేక్ ఇవ్వలేకపోయింది. దీంతో రామ్ తన కెరీర్ పట్ల పూర్తిస్థాయి ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఒక హీరో వరుస ప్లాపుల్లో ఉంటే కొత్త దర్శకుల కోసం వెతుకుతారు. కానీ రామ్ ఆలోచన డిఫరెంట్‌గా ఉంది. తన బలాలు ఏంటి? బలహీనతలు ఏంటి? అనేది ఒక నటుడిగా తనకన్నా బాగా ఇంకెవరికి తెలుస్తుంది అనుకున్నాడట. అందుకే తన తదుపరి సినిమాకు తానే కథను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. మొదట కథ ఇచ్చి వేరే దర్శకుడితో చేయిద్దాం అనుకున్నా, చివరి నిమిషంలో మనసు మార్చుకుని మెగాఫోన్ పట్టాలని డిసైడ్ అయ్యాడట.


సినిమాల ఎంపికలోనూ, మేకింగ్ ప్రాసెస్‌లోనూ రామ్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ఇప్పుడు అదే అనుభవంతో తన సొంత బ్యానర్ స్రవంతి మూవీస్ లో ఈ భారీ ప్రాజెక్టును తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌లో అడవి శేష్, విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ వంటి యంగ్ హీరోస్ తమ సొంత కథలతో సక్సెస్ అవుతున్నారు. ఇప్పుడు రామ్ కూడా అదే బాటలో ప్రయాణించి తన ఫేట్‌ను మార్చుకోవాలని చూస్తున్నారు. ఒక ప్లాప్ పడగానే కుంగిపోకుండా, తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవడం నిజమైన స్టార్ లక్షణం. రామ్ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం టాలీవుడ్‌లో కొత్త సంచలనానికి తెరలేపబోతోంది. మరి డైరెక్టర్‌గా రామ్ పోతినేని బాక్సాఫీస్ వద్ద తన పూర్వ వైభవాన్ని అందుకుంటాడో లేదో చూడాలి.

Updated Date - May 04 , 2026 | 02:51 PM