Ram Gopal Varma: ‘పోలీస్ కంపెనీ’ షూటింగ్ అడ్డుకున్న ఫెడరేషన్.. చివరకు బకాయిల చెల్లింపు!

ABN , Publish Date - Aug 20 , 2026 | 04:08 PM

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు సంబంధించిన బకాయిల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌(RGV) వర్మకు సంబంధించిన బకాయిల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన పలు చిత్రాలకు పనిచేసిన సినీ కార్మికులు, ఇతర సిబ్బందికి చెల్లించాల్సిన సుమారు రూ.1.32 కోట్ల బకాయిలు కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని ఫెడరేషన్‌ ఆఫ్‌ వెస్ట్రన్‌ ఇండియన్‌ సినీ ఎంప్లాయీస్‌ (FWICE) అధ్యక్షుడు బి.ఎన్‌.తివారి వెల్లడించారు. ‘సర్కార్‌’, ‘సర్కార్‌ 3’తో పాటు మరికొన్ని చిత్రాలకు పనిచేసిన సిబ్బందికి ఆర్జీవీ నుంచి చెల్లింపులు రావాల్సి ఉందని ఆయన తెలిపారు. 2019లో మొత్తం బకాయిలను ఒకేసారి చెల్లిస్తానని హామీ ఇస్తూ వర్మ లేఖ రాశారని, ఆ తర్వాత ముంబయిలోని తన కార్యాలయాన్ని మూసివేసి అందుబాటులో లేకుండా పోయారని తివారి పేర్కొన్నారు. ఆ తర్వాత గోవాలో వర్మ కనిపించారని, అక్కడ కూడా త్వరలోనే బకాయిలు చెల్లిస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. అనంతరం హైదరాబాద్‌కు వెళ్లి అక్కడ చిన్న సినిమాలు తీసారని ఆరోపించారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ‘పోలీస్‌ కంపెనీ’ షూటింగ్‌ కోసం మళ్లీ ముంబయికి రావడంతో ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని,  దీంతో సినిమా ముహూర్తం రోజునే షూటింగ్‌ను అడ్డుకున్నామని తివారి వెల్లడించారు. ఈ వ్యవహారంలో కొందరు ప్రముఖులు జోక్యం చేసుకోవడంతో రామ్‌గోపాల్‌ వర్మ చివరకు దిగొచ్చి, పెండింగ్‌లో ఉన్న బకాయిల మొత్తాన్ని చెల్లించారని చెప్పారు. దీంతో షూటింగ్‌కు ఎలాంటి మరింత అంతరాయం కలగకుండా పరిస్థితి సద్దుమణిగిందని బి.ఎన్‌.తివారి పేర్కొన్నారు.

Updated Date - Aug 20 , 2026 | 04:27 PM