Ram Charan: సుక్కు సినిమాకు షరతులు వర్తిస్తాయి...
ABN , Publish Date - Jan 02 , 2026 | 03:09 PM
రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో 'పెద్ది' చేస్తున్నాడు. అది కాగానే సుక్కు డైరెక్షన్ లో మరోసారి చెర్రీ నటించబోతున్నాడు. అయితే ఈ సినిమాకు రామ్ చరణ్ కొన్ని షరతులు పెట్టాడట!
'రంగస్థలం'తో బాక్సాఫీస్ వద్ద రచ్చ రంబోలా చేసిన డైరెక్టర్ సుకుమార్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో మరో మూవీ పట్టాలెక్కనుంది. దాంతో సినీ లవర్స్ అందరూ ఆ ప్రాజెక్ట్ వైపు ఆసక్తిగా చూస్తున్నారు. అంతేకాదు ఈ మూవీ కోసం సుక్కుకు చెర్రీ ఓ కండిషన్ పెట్టినట్టూ తెలుస్తోంది.
'రంగస్థలం' (Rangasthalam) తో రామ్ చరణ్ (Ram Charan) కు అదిరిపోయే హిట్ అందించిన సుకుమార్ (Sukumar) ఆ తరువాత అల్లు అర్జున్ తో వరుసగా 'పుష్ప' (Puspa) రెండు భాగాలతోనూ భలేగా అలరించారు. 'పుష్ప-1'తో పాన్ ఇండియా డైరెక్టర్ గా జేజేలు అందుకున్న సుకుమార్, 'పుష్ప-2'తో ఏకంగా 1700 కోట్లకు పైగా పోగేసి వేయి కోట్ల క్లబ్ లో చోటు దక్కించుకున్నారు. అందువల్ల రామ్ చరణ్ తో సుకుమార్ తెరకెక్కించబోయే మూవీపై ఆల్ ఇండియా లెవెల్లో ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు. ఈ సినిమా రామ్ చరణ్ 17వ చిత్రంగా రూపొందనుంది. ఈ మూవీతో తప్పకుండా తమ హీరో రామ్ చరణ్ కు సుకుమార్ ఓ బంపర్ హిట్ అందిస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్, సుకుమార్ కు ఓ కండిషన్ పెట్టినట్టు సమాచారం.
సాధారణంగా సుకుమార్ తన సినిమాల చిత్రీకరణకు ఎక్కువ సమయం తీసుకుంటారు. కానీ రామ్ చరణ్ మాత్రం ఈ చిత్రాన్ని ఏడాదిలోపే పూర్తి చేయాలని ఓ కండిషన్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇకపై ఎక్కువ సినిమాలు చేయాలనే ఉద్దేశంతో, సుదీర్ఘ కాలం పాటు షూటింగ్ సాగే ప్రాజెక్టులకు ఆయన స్వస్తి పలకనున్నారట. ఇదే కనుక నిజమైతే, ఈ ఏడాది జూలై లేదా ఆగస్టులో ప్రారంభం కాబోయే ఈ చిత్రం.. వచ్చే ఏడాది ఆగస్టు నాటికే థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ మూవీలో కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ కథానాయికగా నటించనుంది.
ప్రస్తుతం రామ్ చరణ్, 'ఉప్పెన' (Uppena) ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో 'పెద్ది' (Peddi) చిత్రంలో నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన గ్లింప్స్, సాంగ్ ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేశాయి. ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు.. విశేషమేంటంటే 'పెద్ది' డైరెక్టర్ బుచ్చిబాబు సుకుమార్ శిష్యుడే! అలా వరుసగా గురుశిష్యుల దర్శకత్వంలో నటించడానికి సిద్ధమయ్యారు రామ్ చరణ్. మరి ముందుగా వచ్చే శిష్యుని 'పెద్ది' ఏ రేంజ్ లో అలరిస్తుందో, ఆ తరువాత రాబోయే గురువు సుక్కు మూవీ ఏ తీరున మెప్పిస్తుందో చూడాలి.