Ram Charan: గాయాన్ని లెక్కచేయని రామ్‌చరణ్‌.. 'పెద్ది' టీమ్ చేసిన పోస్ట్ వైరల్

ABN , Publish Date - Jul 28 , 2026 | 01:50 PM

Ram Charan Recovering Well After Wrist Surgery Peddi Team Praises His Dedication

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ (Ram Charan) మణికట్టుకు సర్జరీ చేసిన సంగతి తెలిసిందే. అనుభవజ్ఞులైన వైద్యుల సమక్షంలో సర్జరీ విజయవంతంగా పూర్తైంది రామ్‌చరణ్‌కి కోయంబతూర్తులోని గంగా ఆస్పత్రిలో ఛైర్మన్‌ డా.ఎస్‌.రాజశేఖరన్‌ నేతృత్వంలో ఈ శస్త్రచికిత్స జరిగింది. అమెరికా నుంచి వచ్చిన వైద్యులు డా.అలెజాండ్రో బాడియా బృందం, డా.ప్రవీణ్‌ భరద్వాజ్‌ శస్త్రచికిత్సని విజయవంతంగా పూర్తి చేశారు.  ప్రస్తుతం వైద్యుల సూచనల మేరకు ఆయన పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులతో పాటు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ మేరకు 'పెద్ది' చిత్ర నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ కూడా సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసింది. 

"ప్రియమైన రాంచరణ్ గారి మణికట్టు ఆపరేషన్ విజయవంతంగా పూర్తి అయినందుకు సంతోషంగా ఉంది. మణికట్టు గాయంతో బాధపడుతున్నప్పటికీ, సినిమాలో  కీలక సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేయడానికి ఆయన చూపిన పట్టుదల మొత్తం యూనిట్‌కు స్ఫూర్తిగా నిలిచింది. సినిమా పట్ల ఆయనకున్న నిబద్ధత నిజంగా ప్రశంసనీయం. ప్రస్తుతం  ఆరోగ్యం నిలకడగా  ఉంది. త్వరగా పూర్తిగా కోలుకుని మరింత ఉత్సాహంతో అభిమానుల ముందుకు రావాలని కోరుకుంటున్నాం' అని ట్వీట్లో పేర్కొన్నారు. ఈ శస్త్రచికిత్స సమయంలో ఆయనతో పాటు భార్య ఉపాసన, తల్లిదండ్రులు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ కూడా కోయంబత్తూరులోనే  ఉన్నారు. 

ఇటీవల విడుదలైన 'పెద్ది' సినిమాతో రామ్‌చరణ్ ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన తదుపరి ప్రాజెక్టుపై దృష్టి సారిస్తున్నారు. స్టార్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ భారీ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు దాదాపు పూర్తయ్యాయి. మరోవైపు ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా వేగంగా సాగుతున్నాయి. అన్ని ఏర్పాట్లు పూర్తైతే అక్టోబర్ లేదా నవంబర్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. 

Updated Date - Jul 28 , 2026 | 02:16 PM