'పెద్ది'.. సమ్మర్ కరువును తీర్చేనా?
ABN , Publish Date - May 31 , 2026 | 07:47 PM
సంక్రాంతి, సమ్మర్, దసరా.. ఈ మూడు సీజన్స్‌లో తమ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శక నిర్మాతలు తీవ్ర స్థాయిలో పోటీ పడుతుంటారు.
సంక్రాంతి, సమ్మర్, దసరా.. ఈ మూడు సీజన్స్‌లో తమ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శక నిర్మాతలు తీవ్ర స్థాయిలో పోటీ పడుతుంటారు. ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగిన టాలీవుడ్ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టి, కనకవర్షం కురిపించాయి. ఆ జోష్ చూసి సమ్మర్ సీజన్ కూడా అదే స్థాయిలో దద్దరిల్లిపోతుందని ఇండస్ట్రీ అంతా ఆశించింది. కానీ, ఈ ఏడాది సమ్మర్ సీజన్ అంచనాలను తలకిందులు చేస్తూ పూర్తిగా డ్రైగా మారిపోయింది.
ఉస్తాద్ చిత్రం మినహాయిస్తే, బాక్సాఫీస్ దాహాన్ని తీర్చే మరో భారీ కమర్షియల్ చిత్రం రాకపోవడం ఇండస్ట్రీకి అతిపెద్ద మైనస్‌గా నిలిచింది. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే, మార్చి 27న థియేటర్లలో సందడి చేయాల్సిన రామ్ చరణ్ (ram charan) పెద్ది (peddi) సినిమా.. ఆ తర్వాత ఏప్రిల్‌కు, ఇప్పుడు ఫైనల్‌గా జూన్ 4కు వాయిదా పడింది. అయితే, ఈ వాయిదా సినిమాకు మైనస్ అవుతుందని సగటు ప్రేక్షకుడు అనుకున్నాడు. కానీ, బాక్సాఫీస్ వద్ద ఏర్పడిన ఈ భారీ గ్యాప్.. ఇప్పుడు పెద్ది సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది.
సినిమాపై ఉన్న విపరీతమైన హైప్ దృష్ట్యా, అటు నార్త్ అమెరికాలో, అలాగే ఇతర ఓవర్సీస్ మార్కెట్లలో పెద్ది సినిమాకు ఊహించని స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ వెల్లువ మొదలైంది. టికెట్లు ఓపెన్ చేసిన క్షణాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఓవర్సీస్ ప్రేక్షకులు ఈ మాస్ జాతర కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో ఈ బుకింగ్స్ స్పష్టం చేస్తున్నాయి. ఇక ప్రమోషన్స్ విషయంలో 'పెద్ది' టీమ్ ఎక్కడా తగ్గడం లేదు. పాన్ ఇండియా స్థాయిలో సినిమా బజ్ క్రియేట్ చేసేందుకు ముంబై, భోపాల్, బెంగళూరు, చెన్నై లాంటి ప్రధాన నగరాల్లో స్పెషల్ ఈవెంట్స్‌ను ఎంతో గ్రాండ్‌గా నిర్వహించారు.
నార్త్ నుంచి సౌత్ వరకు ప్రతీ చోటా సినిమా ప్రమోషన్స్ పీక్స్‌కు చేరుకున్నాయి. ఈ ప్రమోషన్స్ పరంపరలో అత్యంత కీలక ఘట్టం.. జూన్ 1వ తేదీన విజయవాడలో జరగనున్న 'పెద్ది' తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్. ఈ వేడుకను కనీవినీ ఎరుగని రీతిలో ప్లాన్ చేస్తున్నారు. ఈ మెగా ఈవెంట్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నారనే వార్త హాట్ టాపిక్‌గా మారింది. 'పెద్ది' స్టేజ్‌పై బాబాయ్, అబ్బాయ్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూడటం అభిమానులకు రోమాలు నిక్కబొడుచుకునే అనుభూతిని ఇస్తుంది. ఫ్యాన్స్‌కు ఇది నిజంగా కన్నుల పండుగే అని చెప్పాలి.
రిలీజ్ సమయం దగ్గర పడుతుండటంతో టికెట్ రేట్ల అంశం కూడా ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో టికెట్టు రేట్లను పెంచకుండా యదాతథంగానే ఉంచనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం భారీ చిత్రాలకు ఇచ్చే మినహాయింపుల్లో భాగంగా స్పెషల్ షోలకు, ఎక్స్‌ట్రా రేట్ల పెంపుకు ఇప్పటికే ప్రభుత్వ అనుమతులు లభించేశాయి. టికెట్టు రేట్లు, థియేటర్ల లెక్కలు ఎలా ఉన్నా.. ఒక్కసారి సక్సెస్ టాక్ వస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ది సృష్టించే విధ్వంసం మామూలుగా ఉండదు. బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం, కలెక్షన్ల సునామీతో థియేటర్లు మారుమ్రోగిపోవడం ఖాయం. ఎన్నో రోజుల నుంచి ఓ సాలిడ్ కమర్షియల్, ఫుల్ మాస్ మూవీ కోసం ఆకలితో ఎదురుచూస్తున్న సినీ అభిమానులకు పెద్ది ఫుల్ మీల్స్ పెట్టబోతుండటంతో.. థియేటర్ల వద్ద ముందస్తు పండగ వాతావరణం నెలకొంది.