Peddi: ముందే వస్తోన్న పెద్ది.. రిలీజ్‌ డేట్‌ మారింది...

ABN , Publish Date - May 01 , 2026 | 05:25 PM

‘పెద్ది’ సినిమా మేకర్స్‌ మెగా అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. ఈ సినిమా విడుదలలో ఉన్న గందరగోళానికి ఫుల్‌స్టాఫ్‌ పెట్టి, రిలీజ్‌ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు.

‘పెద్ది’ సినిమా మేకర్స్‌ మెగా అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. ఈ సినిమా విడుదలలో ఉన్న గందరగోళానికి ఫుల్‌స్టాఫ్‌ పెట్టి, రిలీజ్‌ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కొత్త రిలీజ్‌ డేట్‌ను వెల్లడించారు. జూన్‌ 4న ‘పెద్ది’ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఇటీవల ఓ వేదికపై దర్శకుడు బుచ్చిబాబు జూన్‌ 25న సినిమా విడుదలకానుందని తెలిపారు. అయితే ఇప్పుడు సినిమా విడుదల తేదీని ముందుకు తీసుకొచ్చారు. దీంతో మెగా అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది.

రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇప్పటికే పలు కారణాల చేత రెండు సార్లు వాయిదా పడింది. దాంతో అభిమానులు కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. ఇప్పుడు కొత్త విడుదల తేదీతో మళ్లీ ఉత్సాహాన్ని పెంచారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేక్షకులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయమని దర్శకుడు బలంగా చెబుతున్నారు. ఈ సినిమా తన కెరీర్‌కు ఎంతో ప్రత్యేకమని, మట్టి లాంటి చిత్రమిదని రామ్‌చరణ్‌ ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పారు.

ఇందులో రామ్‌చరణ్‌ సరసన జాన్వీకపూర్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఏ.ఆర్‌ రెహమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు యూట్యూబ్‌ను, సోషల్‌ మీడియాను షేక్‌ చేశాయి. మరో డ్యూయెట్‌, ఐటమ్‌ సాంగ్‌ విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఐటమ్‌ సాంగ్‌లో శ్రుతీహాసన్‌ నటిస్తున్నారు. త్వరలోనే ఈ పాటను విడుదల చేయనున్నారు.

Updated Date - May 01 , 2026 | 06:07 PM