RC 17: రామ్ చరణ్ సీరియస్ మోడ్.. సుకుమార్ స్పీడ్ పెంచక తప్పదా?
ABN , Publish Date - Jul 09 , 2026 | 02:24 PM
పెద్ది సినిమా అనంతరం రామ్ చరణ్ - సుకుమార్ కాంబోలో చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) 'ఆర్ఆర్ఆర్' తర్వాత భారీ అంచనాలతో వచ్చిన 'గేమ్ ఛేంజర్' బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈ సినిమా కోసం చరణ్ తన విలువైన సమయాన్నికేటాయించినప్పటికీ, ఫలితం మాత్రం అభిమానులను కాస్త నిరాశపరిచింది. అయితే, ఆ వెంటనే తన పంథా మార్చుకున్న మెగా పవర్ స్టార్.. ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన 'పెద్ది' సినిమాతో తన సత్తా ఏంటో మరోసారి బాక్సాఫీస్ కు రుచి చూపించారు. పల్లెటూరి నేపథ్యంతో సాగే ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో చరణ్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతం ఈ విలేజ్ డ్రామాకు ప్రాణం పోసింది.
ఇక ఈ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న రామ్ చరణ్.. తన తదుపరి చిత్రం కోసం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌తో చేతులు కలుపుతున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఇండస్ట్రీ హిట్ 'రంగస్థలం' సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా తర్వాత మళ్ళీ వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే, ఈ సినిమా విషయంలో చరణ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.
ఇకపై సినిమాల మధ్య లాంగ్ బ్రేక్స్ తీసుకోకూడదని, తన ప్రాజెక్టుల వేగాన్ని అమాంతం పెంచాలని ఆయన ఫిక్స్ అయ్యారట. ఇందులో భాగంగానే ఆర్సీ 17 షూటింగ్ ప్రాసెస్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సుకుమార్ (Sukumar)ను స్వయంగా కోరినట్లు సమాచారం. సాధారణంగా సుకుమార్ ప్రతి ఫ్రేమ్‌ను చెక్కేందుకు కాస్త ఎక్కువ సమయం తీసుకుంటారు. కానీ చరణ్ తాజా నిర్ణయంతో ఈసారి ఆయన కూడా తన మేకింగ్ స్పీడ్ పెంచక తప్పదని తెలుస్తోంది.
అన్నీ అనుకున్నట్లు జరిగితే సుకుమార్-చరణ్ ల ప్రతిష్ఠాత్మక చిత్రం వచ్చే ఏడాదిలోనే థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ సినిమా పూర్తయిన తర్వాత చరణ్ భవిష్యత్తు ప్రాజెక్టులపై కూడా రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చరణ్ మరోసారి బుచ్చిబాబుతో జత కట్టనున్నారని ఒక టాక్ నడుస్తుండగా, ఓ ప్రముఖ కన్నడ దర్శకుడితో కూడా పాన్ ఇండియా రేంజ్ మూవీ చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ, సినిమాల్లో వేగం పెంచాలని చరణ్ తీసుకున్న నిర్ణయంపై మాత్రం మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సూపర్ హిట్లు అందుకోవాలని నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. అయితే చరణ్ నిజంగానే వరుస పెట్టి సినిమాలు చేస్తారా? లేక మునుపటిలాగే ఒక సినిమా తర్వాత మరో సినిమాకు గ్యాప్ తీసుకుంటారా? అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.