తండ్రి బాటలో పయనిస్తూ అలరిస్తోన్న రామ్ చరణ్
ABN , Publish Date - Mar 30 , 2026 | 03:37 PM
కొందరికి పేరుకు తగ్గ పాత్రలు పలకరిస్తూ ఉంటాయి... నాటి మేటి నటుల్లో కొందరు అలాగే సాగారు... ఈ తరంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా అదే రూటులో పయనిస్తున్నట్టు తెలుస్తోంది.
కొందరికి పేరుకు తగ్గ పాత్రలు పలకరిస్తూ ఉంటాయి... నాటి మేటి నటుల్లో కొందరు అలాగే సాగారు... ఈ తరంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా అదే రూటులో పయనిస్తున్నట్టు తెలుస్తోంది.
భక్తుడు - భగవంతుని పాత్రల్లో...
రామ్ చరణ్ పూర్తి పేరు 'రామ్ చరణ్ తేజ' అంటే రాముని చరణాల వద్ద వెలిగేవాడు అని అర్థం. అనగా హనుమంతుడు అని భావం. అలా ఆరంభంలో 'రాముని' పేరు- పూర్తి పేరులో 'ఆంజనేయుని' కలిగి ఉన్నారు చెర్రీ. ఈ నేపథ్యంలోనే ఆయన తాజా చిత్రం 'పెద్ది'లో పహిల్వాన్ గా కనిపించడంతో చర్చ మొదలయింది. 'పెద్ది'లో హనుమంతుని భక్తునిగా మల్లయోధునిగా కనిపించనున్నారు చెర్రీ. అంటే ఆంజనేయుల వారిలాగే ఆయన గెటప్ ను రూపొందించారన్న మాట. ఇక 'ట్రిపుల్ ఆర్'లో ఆయన పాత్ర పేరు సీతారామరాజు... అందులో 'రాముని'లా కనిపిస్తూ ప్రత్యర్థులను చిత్తూ చేస్తూ సాగారు చెర్రీ. ఇప్పుడు 'ఆంజనేయుని'లా బలశాలిగా కనిపించబోతున్నారు. అదీ ఇప్పటి విశేషం. అలా దేవుడు శ్రీరామునిగా, ఆయన భక్తుడు ఆంజనేయుని పోలిన పాత్రల్లో చరణ్ నటించడం ఫ్యాన్స్ కు విశేషంగా మారింది.
తండ్రిని తలపిస్తూ...
మెగాస్టార్ చిరంజీవి మొదటి నుంచీ ఆంజనేయ స్వామి భక్తుడు. ఆయన పేరు శివశంకర వరప్రసాద్ అయినా, చిత్రసీమలో చిరంజీవిగానే సాగారు. చిరంజీవి అంటే ఆంజనేయుల వారినే అధికులు స్మరిస్తారు. ఆంజనేయ స్వామి కూడా అంజనాదేవికి శివశంకర వరప్రసాదమే కావడం గమనార్హం. ఇక నిజజీవితంలోనూ చిరంజీవి తల్లి పేరు అంజనాదేవి కావడం మరింత విశేషం! అందువల్లే చిరంజీవి తన వారసునికి కూడా 'రామ్ చరణ్ తేజ' అని నామకరణం చేశారు. ఇప్పుడు తండ్రికి తగ్గ తనయునిగా చెర్రీ నాన్న చూపిన బాటలోనే పయనిస్తున్నారు. 'జగదేకవీరుడు-అతిలోక సుందరి' మూవీలో ఓ సీన్ లో కాసేపు చిరంజీవి హనుమంతుని గెటప్ లో కనిపించి అలరించారు. ఈ విషయాన్ని 'పెద్ది' పెహల్వాన్ గ్లింప్స్ చూసినప్పటి నుంచీ ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు...
అదే తీరున బంపర్ హిట్...
పలు విషయాల్లో తండ్రిని అనుసరించే రామ్ చరణ్ 'ట్రిపుల్ ఆర్'లో ఓ సీన్ లో సీతారామరాజులాగే కనిపించి అలరించారు... ఇప్పుడు ఆంజనేయుని పోలిన పహిల్వాన్ పాత్రలో కనిపించనున్నారు. అప్పట్లో చిరంజీవి సైతం 'పట్నం వచ్చిన పతివ్రతలు'లో ఓ పాటలో కాసేపు మీసాల రామునిగా తళుక్కుమన్నారు. ఆ సినిమా అలరించింది...ఇక చిరంజీవి ఆంజనేయుని గెటప్ వేసిన 'జగదేకవీరుడు-అతిలోక సుందరి' సూపర్ హిట్టయింది. అదే తీరున 'ట్రిపుల్ ఆర్'తో బ్లాక్ బస్టర్ హిట్ చూసిన చెర్రీ, రాబోయే 'పెద్ది'తోనూ బంపర్ హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి ఏప్రిల్ 30న రాబోయే 'పెద్ది' ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి...