పెద్ది: ఏప్రిల్‌ 30న రావాలంటే ఆ మాత్రం ఉండాలి..

ABN , Publish Date - Feb 19 , 2026 | 12:52 PM

సుకుమార్‌ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసి ‘ఉప్పెన’ సినిమాతో దర్శకుడిగా మారారు బుచ్చిబాబు సానా (Buchibabu Sana). ఆ చిత్రం భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

సుకుమార్‌ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసి ‘ఉప్పెన’ సినిమాతో దర్శకుడిగా మారారు బుచ్చిబాబు సానా (Buchibabu Sana). ఆ చిత్రం భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తదుపరి బుచ్చిబాబుకి జూ. ఎన్టీఆర్‌ను డైరెక్ట్‌ చేసే అవకాశం వచ్చింది. ఆయన కూడా పలు సందర్భాల్లో ఈ విషయాన్ని చెప్పారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు. అదే కథతో రామ్‌చరణ్‌ను (Ram Charan) ఒప్పించి ‘పెద్ది' (Peddi Movie) చిత్రాన్ని షురూ చేశారు. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. మార్చి 27న సినిమాను విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేశారు. కానీ పలు కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడున్న షెడ్యూల్‌ ప్రకారం సినిమా ఏప్రిల్‌ 30న రానుంది. ఆ డేట్‌కి రావాలంటే షూటింగ్‌ జెట్‌ వేగంతో చేయాలి.

ప్రస్తుతం అదే పనిలో ఉంది బుచ్చిబాబు బృందం. ఎందుకంటే షూటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు చాలా వరకూ పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం. అందుకే హీరో, డైరెక్టర్, ఇతర బృందం రెస్ట్‌లెస్‌గా పని చేస్తున్నారట. ఒక్కరోజు కూడా గ్యాప్‌ లేకుండా నాన్‌స్టాప్‌గా వర్క్‌ చేస్తున్నారట. పగలంతా షూటింగ్‌ చేయడం, రాత్రికి ఎడిటింగ్‌ రూమ్‌లో కూర్చోవడం.. మళ్లీ ఉదయాన్నే సెట్‌కి వెళ్లడం.. కొన్ని రోజులుగా దర్శకుడు బుచ్చిబాబు దినచర్య ఇదేనని అంటున్నారు. ఇలా చేస్తేనే సినిమా ఏప్రిల్‌ 30న ప్రేక్షకుల ముందుకు రాగలదని చెబుతున్నారు.

బుచ్చిబాబు రాత్రింబవళ్లు సినిమా కోసం శ్రమిస్తున్నారని, పుట్టినరోజున కూడా ఖాళీ లేకుండా సినిమా పనిలోనే ఉన్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరో పక్క చెన్నైలోని రెహమాన్‌ స్టూడియోలో రీ-రికార్డింగ్‌ జరుగుతోందట. బుచ్చిబాబు ఆ వైపు కూడా దృష్టి సారిస్తున్నారు. ఇలాంటి సమయంలో తన సహాయకుడికి దర్శకుడు సుకుమార్‌ కాస్త అండగా నిలిస్తే బావుంటుందని సన్నిహితులు సూచిస్తున్నారట. కానీ ప్రస్తుతం ఆయన రామ్‌చరణ్‌తో తీయబోయే సినిమా కథను ఫైనల్ చేసే పనుల్లో ఉన్నారు. అయినా కూడా అప్పుడప్పుడు బుచ్చిబాబుకి సలహాలు ఇస్తున్నారట సుకుమార్‌. వీలైనంత త్వరగా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసి అనుకున్న టైమ్‌కే సినిమాను విడుదల చేయాలని గట్టిగానే కృషి చేస్తున్నారని తెలుస్తోంది.

Updated Date - Feb 19 , 2026 | 02:35 PM