మ‌రింత బాధ్య‌త‌తో.. మ‌రిన్ని మంచి సినిమాలు చేస్తాం

ABN , Publish Date - Mar 26 , 2026 | 08:23 PM

రాజు వెడ్స్ రాంబాయి చిత్రం సాధించిన విజ‌యం, అవార్డుల‌ను పురస్కరించుకుని ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమం నిర్వహించారు.

venu

అఖిల్ రాజ్ (Akhil Raj), తేజస్వీ రావు (Tejaswi Rao) జంటగా నటించిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయి (Raju Weds Rambai). ఈ మూవీకి సాయిలు కంపాటి (Saailu Kampati) దర్శకత్వం వహించగా, వేణు ఊడుగుల (Venu Udugula), రాహుల్ మోపిదేవి నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. 2026 తెలంగాణ గద్దర్ అవార్డుల్లో (Telangana Gaddar Film Awards) ఉత్తమ చిత్రం సహా నాలుగు విభాగాల్లో గౌరవాలు అందుకోవడం ఈ సినిమాకు ప్రత్యేక గుర్తింపునిచ్చింది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో జరిగిన నిజ సంఘటనల స్ఫూర్తితో రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుని, రాష్ట్ర స్థాయి అవార్డులతో గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఈ విజయాన్ని పురస్కరించుకుని ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా సీనియర్ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న సినిమాలకు థియేటర్లలో అవకాశాలు దక్కడం ఎంత కష్టమో చెప్పుకొచ్చారు. అలాంటి సమయంలో ఈ చిత్రం విజయవంతం కావడం నిజంగా అభినందనీయమన్నారు. కథ, నటన పరంగా సినిమా ఎంతో సహజంగా నిలిచిందని కొనియాడారు. దర్శకుడు-నిర్మాత వేణు ఊడుగుల మాట్లాడుతూ.. తాను మొదట జర్నలిజం పట్ల ఆసక్తితోనే కెరీర్ ప్రారంభించానని చెప్పారు. విమర్శకుల అభినందనలు తనకు ప్రత్యేకమైన ఆనందాన్ని ఇస్తాయని, ఇప్పటివరకు వచ్చిన అవార్డులకంటే క్రిటిక్స్ నుంచి వచ్చిన ప్రశంసలే పెద్ద గుర్తింపుగా భావిస్తున్నానన్నారు. ఇకపై మరింత బాధ్యతతో మంచి సినిమాలు తీసేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.

venu

నిర్మాత రాహుల్ మోపిదేవి, సమర్పకుడు నాగేశ్వరరావు పూజారి మాట్లాడుతూ.. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలకు విమర్శకుల ప్రోత్సాహం ఎంతో అవసరమని అన్నారు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరి కృషి వల్లే అవార్డులు సాధ్యమయ్యాయని చెప్పారు. ఏ కళారూపానికైనా విమర్శ ఎంతో ముఖ్యమని అన్నారు. అది లేకపోతే ఆ కళలో లోతు ఉండదని, సమాజానికి అనుసంధానం కోల్పోతుందని అభిప్రాయపడ్డారు. దర్శకుడు సాయిలు కంపాటి తన అనుభవాన్ని పంచుకుంటూ, తాను చూసిన జీవితాల నుంచే ఈ కథ పుట్టిందన్నారు. సినిమా విజయంతో పాటు అవార్డులు రావడం తనకు అదనపు ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు. ఈ ప్రయాణంలో వేణు ఊడుగుల సహకారం మరువలేనిదని పేర్కొన్నారు.

నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ, దర్శకుడి విజన్ ప్రారంభం నుంచే స్పష్టంగా ఉందని, సాయిలు కంపాటి భవిష్యత్తులో గొప్ప దర్శకుడిగా ఎదుగుతాడని నమ్మకం వ్యక్తం చేశారు.ఇతర టీమ్ సభ్యులు కూడా సినిమా విజయానికి మీడియా, ప్రేక్షకుల సహకారం ముఖ్యమని చెబుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఎప్పుడూ ప్రోత్సహించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు.

Updated Date - Mar 26 , 2026 | 08:23 PM