Rajendra Prasad: నట కిరీటి రాజేంద్ర ప్రసాద్‌కు పద్మశ్రీ.. కామెడీ కింగ్‌కు జాతీయ గౌరవం
ABN , Publish Date - Jan 26 , 2026 | 06:29 AM
తెలుగు సినీ పరిశ్రమలో కామెడీకి కొత్త నిర్వచనం ఇచ్చిన నట కిరీటి రాజేంద్ర ప్రసాద్‌కు పద్మశ్రీ అవార్డు. ఆయన సినీ ప్రయాణం, హిట్ సినిమాలు, ప్రత్యేక కథనం.
తెలుగు తెరపై హాస్యానికి కొత్త నిర్వచనం చెప్పి, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ ప్రశంసలు అందుకున్న ‘నట కిరీటి’ రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad)ను కేంద్రం పద్మశ్రీతో గౌరవించింది. హీరోగా ఒక తరాన్ని నవ్వించి, ఇప్పుడు తండ్రి, తాత పాత్రల్లో అలరిస్తున్నారు. వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘లేడీస్ టైలర్’ చిత్రం రాజేంద్ర ప్రసాద్ కెరీర్‌ను మలుపుతిప్పింది. ‘అహ నా పెళ్లంట, అప్పుల అప్పారావు’ చిత్రాలతో ఆయన కామెడీ కింగ్‌గా మారారు. ‘ఆ నలుగురు’ సినిమాతో ఆయనలోని పరిపూర్ణ నటుణ్ణి ప్రపంచం చూసింది. రెండొందలకు పైగా చిత్రాల్లో నటించిన ఆయన తెలుగు సినిమా గర్వించదగ్గ నటుల్లో ఒకరు.
కృష్ణా జిల్లా నిమ్మకూరులో, ఒక మధ్యతరగతి కుటుంబంలో 1956 జూలై 19న జన్మించిన రాజేంద్ర ప్రసాద్, తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును లిఖించుకున్నాడు. ఆయన తల్లిదండ్రులు గద్దె వెంకట నారాయణ, మాణిక్యాంబ. తండ్రి వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. సీనియర్ ఎన్టీఆర్ ఈ గ్రామానికే చెందిన వాడవడంతో ఆయన ప్రభావం రాజేంద్ర ప్రసాద్‌పై గట్టిగానే పడింది. మిమిక్రీతో ఎన్టీఆర్‌ను మెప్పిస్తూ, నటన పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు. సిరామిక్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తిచేసిన తరువాత, సినిమా రంగంలో స్థిరపడాలనే ఆశతో ముందడుగు వేశాడు. ఎన్టీఆర్ ప్రోత్సాహంతో చెన్నైలోని సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్లో చేరి శిక్షణ పొందాడు. అక్కడ గోల్డ్ మెడల్ సాధించినప్పటికీ, మొదటి రోజుల్లో అవకాశాలు అందక కష్టకాలాన్ని ఎదుర్కొన్నాడు. ఆర్థిక ఇబ్బందులు, నిరాశలు అతన్ని పరీక్షించినా ఒక్క అవకాశం ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. తన బంధువు, నిర్మాత, రచయిత అట్లూరి పుండరీకాక్షయ్య పరిచయం ఆయన కెరీర్‌కు కీలక మలుపుగా మారింది. ఎన్టీఆర్ నటించిన ఒక చిత్రంలో తమిళ నటుడి పాత్రకు రాజేంద్ర ప్రసాద్ డబ్బింగ్ ఇవ్వడం ద్వారా పరిశ్రమలోకి అడుగుపెట్టాడు.
అనంతరం కొన్ని రోజులు డబ్బింగ్ ఆర్టిస్టుగా కొనసాగుతూ అవకాశాల కోసం ప్రయత్నించాడు. బాపు దర్శకత్వంలోని ‘స్నేహం’ సినిమాలో చిన్న పాత్రతో నటన ప్రారంభించాడు. 1977 సెప్టెంబర్ 5న విడుదలైన తొలి చిత్రం ఆయన సినీ ప్రయాణం ఆరంభమైంది. ఆ తర్వాత చాయ, నిజం, మూడు ముళ్ల బంధం, పెళ్లి చూపులు, రామరాజ్యంలో భీమరాజు, పోరాటం, రోజులు మారాయి, వందేమాతరం వంటి చిత్రాల్లో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మంచుపల్లకి ఆయన నటనా ప్రతిభను మరో మెట్టుకు తీసుకెళ్లింది. ‘ఇక.. దర్శకుడు వంశీ దర్శకత్వంలో 1986లో విడుదలైన ‘లేడీస్ టైలర్’తో రాజేంద్ర ప్రసాద్ స్టార్‌డమ్ అందుకున్నాడు. టైలర్ సుందరం పాత్రలో ఆయన చేసిన కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్, హావభావాలు ప్రేక్షకులను విపరీతంగా నవ్వించాయి. ఈ చిత్రం ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. ఆ తర్వాత అహనా పెళ్లంట, ఏప్రిల్ 1 విడుదల, అప్పుల అప్పారావు, జయమ్ము నిశ్చయమ్మురా, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం, ఆ ఒక్కటీ అడక్కు, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, మేడమ్, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, హిట్లర్, శ్రీరామ చంద్రులు, ఆ నలుగురు వంటి ఎన్నో హిట్ చిత్రాలతో కామెడీ హీరోగా తిరుగులేని స్థానం సంపాదించాడు.
కామెడీతో పాటు సీరియస్ పాత్రల్లోనూ తన నటనా ప్రతిభను చాటుకున్నాడు రాజేంద్ర ప్రసాద్. ఛాలెంజ్, కాశ్మోరా, ప్రేమ తపస్సు, ఎర్రమందారం, ముత్యమంత ముద్దు వంటి చిత్రాల్లో భావోద్వేగభరిత పాత్రలతో మరో కోణాన్ని చూపించాడు. హీరోగా అవకాశాలు తగ్గుతున్న సమయంలో ‘ఆ నలుగురు’ సినిమాలో రఘురామ్ పాత్ర ఆయన కెరీర్‌కు కొత్త గుర్తింపునిచ్చింది. మానవీయ విలువలతో నిండిన ఆ పాత్ర ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసింది. అనంతరం టామీ, మీ శ్రేయోభిలాషి, ఓనమాలు వంటి చిత్రాలు ఆయనలోని నటనా వైవిధ్యాన్ని మరింతగా బయటకు తీసుకువచ్చాయి. ఆపై సోలో హీరోగా అవకాశాలు తగ్గినా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి ఇంకా బిజీగా మారిపోయాడు. శ్రీమంతుడు, సరిలేరు నీకెవ్వరు, నాన్నకు ప్రేమతో, సుప్రీమ్, అలా వైకుంఠపురం, జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ తన ప్రస్థానాన్ని ఆ ప్రతిహాతంగా కొనసాగిస్తున్నారు. అంతేకాదు.. ఆయన హీరోగా అంతర్జాతీయ స్థాయిలో రూపొందిన చిత్రం ‘క్విక్ గన్ మురుగన్’ హాలీవుడ్‌లోను రిలీజ్ అయింది. కామెడీ పాత్రలతోను హీరోగా నిలదొక్కుకోవచ్చని నిరూపించిన అరుదైన నటుల్లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఒకరు. ఆయన సృష్టించిన ప్రత్యేకమైన హ్యూమర్ స్టైల్‌ను ఇప్పటికీ ఎవ్వరూ మ్యాచ్ చేయలేక పోతున్నారు.