మగధీర రేంజ్ లో రాజా ది రాజా.. ట్రైలర్ అదిరింది
ABN , Publish Date - Jul 06 , 2026 | 09:57 PM
టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథలతో వస్తున్న చిన్న చిత్రాలకు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడుతుంటారు. ఆ కోవలోనే సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం రాజా ది రాజా (Raja The Raja).
టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథలతో వస్తున్న చిన్న చిత్రాలకు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడుతుంటారు. ఆ కోవలోనే సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం రాజా ది రాజా (Raja The Raja). రుత్విక్, విశాఖ ధీమన్ హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న ఈ సినిమాకు అనిల్ బోయిడాపు దర్శకతవం వహించగా.. వృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. నిహారిక దాసరి నిర్మించింది. వృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. నిహారిక దాసరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తుండడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.
ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ఇదొక విభిన్నమైన రెండు కాలాల ప్రేమకథ అని ట్రైలర్ ని బట్టి స్పష్టమవుతోంది. ట్రైలర్ మొదట ఒక రాచరిక సామ్రాజ్యం బ్యాక్‌డ్రాప్‌లో ఎంతో గ్రాండ్‌గా మొదలవుతుంది. రాజా విరాట వర్మ దేవరాయ రాజ్యాన్ని ఎంతో గొప్పగా పరిపాలిస్తాడు. కానీ, యువరాజు.. ఆద్య అనే రాజకుమారిని ప్రేమిస్తాడు. వారి ప్రేమ గిట్టని మరొక రాజు వారిద్దరిని విడదీస్తాడు. ఈ ప్రేమ వలనే రాజ్యంలో కరువు వచ్చిందని భావించిన రాజు.. యువరాజుకు మరణ శిక్ష విధిస్తాడు. అక్కడ తనువు చాలించిన యువరాజు.. మళ్లీ పుడతాడు. తన ప్రేమను దక్కించుకోవడానికి ఈసారి యువరాజు ఏం చేశాడు..? ఈ జన్మలో కూడా ప్రేమను త్యాగం చేశాడా.. ? ఫ్యాషన్ డిజైనర్ గా పుట్టిన అతను.. తన కుటుంబ సమస్యలను ఎలా ఎదుర్కొన్నాడు.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
దర్శకుడు అనిల్ బోయిడాపు పాత కాలపు రాజసం, ఇప్పటి తరం మోడ్రన్ లవ్ స్టోరీని బ్యాలెన్స్ చేస్తూ ట్రైలర్‌ను కట్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. డెబ్యూ హీరో రుత్విక్ పీరియాడిక్ రోల్‌లో ఇంటెన్సిటీ, ప్రజెంట్ రోల్‌లో ఈజ్ చూపిస్తూ అదరగొట్టగా, విశాఖ ధీమన్ తన అందం, కెమిస్ట్రీతో అలరించింది. సీనియర్ నటుడు నరేష్ హీరో తండ్రి పాత్రలో కనిపించగా సాయి కుమార్ రాజా విరాట వర్మ దేవరాయగా జీవించేశాడు. ఇక రవికిరణ్ బోయిడాపు సినిమాటోగ్రఫీ, మార్క్ కె రాబిన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ విజువల్స్ కి ప్రాణం పోశాయని చెప్పాలి. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే మగధీర గుర్తుకురాక మానదు. ఆ రేంజ్ లో తెరకెక్కిన ఈ సినిమా జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.