Rim Jim: రాహుల్ సిప్లిగంజ్ కీలక పాత్రలో గ్యాంగ్ స్టర్ డ్రామా...
ABN , Publish Date - Jan 04 , 2026 | 05:55 PM
రాహుల్ సిప్లిగంజ్ రెండు పాటలు పాడటంతో పాటు కీలక పాత్ర పోషించిన సినిమా 'రిమ్ జిమ్'. గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో అజయ్ వేద్, వ్రజన హీరహీరోయిన్లుగా నటిస్తున్నారు.
మూడున్నర దశాబ్దాల క్రితం 1990ల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న సినిమా 'రిమ్ జిమ్' (Rim Jim). హేమ సుందర్ దర్శకత్వంలో AV సినిమాస్, సి విజువల్స్ బ్యానర్ల పై సచేతన్ రెడ్డి, డా. మానస, శ్రీనివాసరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'అస్లీ దమ్' అనేది ట్యాగ్ లైన్. స్నేహం, ప్రేమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు హేమ సుమందర్ మాట్లాడుతూ, 'సినిమా అవుట్ పుట్ బాగా వచ్చింది. అందరికీ ఈ సినిమా నచ్చుతుందనే నమ్మకం ఉంది. అతి త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం' అని అన్నారు.
అజయ్ వేద్, వ్రజన హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) కీలక పాత్రను పోషించడంతో పాటు ఇందులోని రెండు పాటలను పాడారు. ఇతర ప్రధాన పాత్రలలో బిత్తిరి సత్తి, రాజ్ తిరందాస్ కనిపించబోతున్నారు. 'రిమ్ జిమ్' మూవీకి కొక్కిలగడ్డ ఇఫ్రాయిం సంగీతం అందిస్తున్నారు. రియలిస్టిక్ టోన్ తో, భావోద్వేగల మేళవింపుగా గ్యాంగ్ స్టర్ డ్రామా దీనిని రూపొందించారు.