పది రోజులకే రూ. 51 కోట్లు.. బాక్సాఫీసును షేక్‌ చేస్తున్న..పెద్దావిడ చిన్న సినిమా

ABN , Publish Date - Mar 10 , 2026 | 07:39 AM

స్టార్స్‌ నటిస్తున్న చిత్రాలే ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఆపసోపాలు పడుతున్న ప్రస్తుత తరుణంలో ఒక చిన్న సినిమా విడుదలైన ‘తాయి కిళవి’ సంచలనం సృష్టిస్తోంది.

Radhika

స్టార్స్‌ నటిస్తున్న భారీ చిత్రాలే ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఆపసోపాలు పడుతున్న ప్రస్తుత తరుణంలో ఒక చిన్న సినిమా విడుదలైన పది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 51. 16కోట్లు (గ్రాస్‌) వసూలు చేసి సంచలనం సృష్టిస్తోంది. ఆ సినిమా పేరు ‘తాయి కిళవి’(Thaai Kizhavi). రాధికా శరత్‌కుమార్ (Radhika Sarathkumar) తన ఆకారాన్ని పూర్తిగా మార్చుకుని పక్కా తమిళనాడు నేటివిటి గెటప్‌ ధరించి ఈ సినిమాలో నటించారు.

రూ. తొమ్మిది కోట్ల బడ్జెట్‌లో తయారైన ‘తాయి కిళవి’ అంచనాలకు మించి వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. 2026లో ఇప్పటివరకూ విడుదలైన తమిళ చిత్రాల్లో రూ. 84.75 కోట్లు వసూలు చేసి ‘పరాశక్తి’ చిత్రం మొదటి స్థానంలో నిలవగా, ఫిబ్రవరి 27న రిలీజ్‌ అయిన ‘తాయి కిళవి’ సినిమా రెండో స్థానంలో చేరింది. సరైన సినిమా లేకపోవడం, విజయ్‌ నటించిన ‘జననాయకన్‌’ సినిమా విడుదల ఎప్పుడనేది ఇతమిద్ధంగా తెలియకపోవడం ‘తాయి కిళవి’కి కలసి వచ్చింది.

Radhika

63 ఏళ్ల వయసులో రాధిక పోషించిన ఈ ఊర మాస్‌ పాత్ర, ఆమె చెప్పే డైలాగులు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. కరుమత్తూర్‌ గ్రామంలో ఉంటూ ఉక్కు మహిళగా పేరొందిన పవునుత్తాయి పాత్రలో రాధిక ఒదిగిపోయిన విధానం, ఆ గెట్‌పలో మేకప్‌ కోసం గంటల తరబడి కష్టపడిన పద్ధతి అభినందనీయం అంటున్నారు ప్రేక్షకులు ముక్తకంఠంతో. డబ్బు పై ఆశ కలిగిన మహిళగా, చివరకు సొంత పిల్లలను కూడా తన అదుపు ఆజ్ఞల్లో ఉంచుకోవడానికి చేసే కఠిన ప్రయత్నాలు రాధికను పవునుత్తాయి పాత్రలో కొత్తగా పరిచయం చేశాయి.

తమిళ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan) నిర్మించిన ఈ చిత్రానికి శివకుమార్‌ మురుగేశన్ (Sivakumar Murugesan) దర్శకత్వం వహించారు. రాధిక కోసమే ఈ సినిమా చూడాలి అనుకునే వాళ్ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండడంతో అతి త్వరలోనే ఈ ‘తాయి కిళవి’ చిత్రం రూ. వంద కోట్ల క్లబ్‌లో చేరే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి అన‌డంలో అతిశ‌యోక్తి ఏ మాత్రం లేదు.

Updated Date - Mar 10 , 2026 | 07:39 AM