Radhika Sarathkumar: రివ్యూల పేరుతో హద్దులు దాటుతున్నారు.. సోషల్ మీడియా తీరుపై రాధిక శరత్‌కుమార్ ఫైర్

ABN , Publish Date - Oct 01 , 2026 | 08:58 AM

సోషల్ మీడియా వేదికగా సినిమా రివ్యూలు, కామెంట్లు చేస్తున్న కొందరి తీరుపై నటి, నిర్మాత రాధిక శరత్‌కుమార్ మండిపడ్డారు.

సోషల్ మీడియా వేదికగా సినిమా రివ్యూలు, కామెంట్లు చేస్తున్న కొందరి తీరుపై నటి, నిర్మాత రాధిక శరత్‌కుమార్ (Radhika Sarathkumar) మండిపడ్డారు. సినిమాలపై అభిప్రాయాలు చెప్పే క్రమంలో నటీనటులు, వారి కుటుంబ సభ్యుల వ్యక్తిగత జీవితాలను ప్రస్తావిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆమె అన్నారు. విమర్శలకు హద్దులు ఉండాలని, వాటి పేరుతో వ్యక్తిగత దూషణలకు పాల్పడే వారిపై తగిన చర్యలు తీసుకునేలా వ్యవస్థ ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రాధిక ఈ అంశంపై తన అభిప్రాయాలను వెల్లడించారు.  

"డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి వచ్చిన తర్వాత సినిమా రివ్యూలు, సోషల్ మీడియా కామెంట్లు భారీగా పెరిగాయి. అయితే విమర్శలకు కూడా కొన్ని హద్దులు ఉంటాయి. సినిమా నచ్చకపోతే దాని గురించి మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని.. కానీ ఆ పేరుతో నటీనటుల వ్యక్తిగత జీవితాలు, కుటుంబాలను ప్రస్తావిస్తూ అసభ్యకరంగా మాట్లాడటం సరికాదు. స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ ప్రతి ఒక్కరి చేతిలో ఉండటంతో సోషల్ మీడియాలో ఏదైనా చెప్పేయొచ్చనే ధోరణి పెరిగింది. యూట్యూబర్స్,  ఇన్‌ఫ్లుయెన్సర్లు తీరును ప్రశ్నించే వ్యవస్థ లేకపోవడం కొందరికి మరింత స్వేచ్ఛను ఇస్తోంది. సినిమా రివ్యూ పేరుతో వ్యక్తిగత విమర్శలు చేయడం, మహిళలను అవమానించేలా మాట్లాడటం వంటి అంశాలు తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది.  రివ్యూల విషయానికొస్తే.. ప్రస్తుతం వాటిపై స్పష్టమైన నియంత్రణ లేదు. కొన్ని సందర్భాల్లో సినిమా నాణ్యతతో సంబంధం లేకుండా కావాలనే ప్రతికూల ప్రచారం జరుగుతోంది.  సినిమా బాగున్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా తప్పుడు అభిప్రాయాలను ప్రచారం చేయడం వల్ల చిత్ర బృందానికి నష్టం కలుగుతోంది.  విమర్శించే హక్కును కాపాడుతూనే, వ్యక్తిగత దూషణలు, అసభ్య వ్యాఖ్యలను నియంత్రించేలా ఒక బలమైన వ్యవస్థ అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. 

Updated Date - Oct 01 , 2026 | 09:11 AM