Pawan Kalyan: పవన్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ సినిమాలు

ABN , Publish Date - Jan 14 , 2026 | 04:05 PM

భోగి శుభ దినాన ప్రముఖ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ ను నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మిలాఖత్ అయ్యారు. త్వరలో తమ కాంబినేషన్ లో రాబోతున్న ప్రాజెక్ట్స్ గురించి వారు చర్చించారు.

Pawan Kalyan - TG Vishwa Prasad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్', ప్రముఖ నిర్మాణ సంస్థ 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ'తో చేతులు కలిపిన విషయం విదితమే. ఈ రెండు సంస్థలు కలిసి గొప్ప చిత్రాలను ప్రేక్షకులను అందించడానికి సిద్ధమవుతున్నాయి. గతంలోనే ఈ సంస్థల మధ్య కథలకు సంబంధించిన చర్చలు జరిగాయి. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కలిసి రాబోయే ప్రాజెక్టులపై చర్చించారు.


పవన్ కళ్యాణ్, టీజీ విశ్వప్రసాద్ భేటీ గురించి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్' స్పందిస్తూ.. 'భోగి శుభ సందర్భంగా కొత్త ఆరంభాల స్ఫూర్తిని సూచిస్తూ, రాబోయే ప్రాజెక్టులపై గతంలో జరిగిన చర్చలను కొనసాగిస్తూ, శ్రీ పవన్ కళ్యాణ్ గారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ని కలిసి మరింత విస్తృతంగా చర్చించారు' అని తెలిపింది.

'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్' ట్వీట్ కి నిర్మాత టీజీ విశ్వప్రసాద్ బదులిస్తూ, 'కథలపై చర్చించడానికి మాకు అవకాశం కల్పించినందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది మాకు ఎంతో విలువైనది. ప్రేక్షకులకు బలమైన, అర్థవంతమైన, ప్రభావవంతమైన కంటెంట్‌ను అందించేందుకు 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్'తో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాము. ఈ కలయిక మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ అద్భుత ప్రయాణం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాం' అని తమ సంతోషాన్ని పంచుకున్నారు.

Updated Date - Jan 14 , 2026 | 04:14 PM