Naga Vamsi: బాక్సాఫీస్ వద్ద.. నాగవంశీ మార్క్ రీసౌండ్!
ABN , Publish Date - Aug 19 , 2026 | 03:19 PM
నిర్మాత నాగవంశీకి ఈ ఏడాది గోల్డెన్ ఇయర్‌గా మారింది. వరుస విజయాలతో గతేడాది ఎదురైన నష్టాలు, విమర్శలకు బాక్సాఫీస్ కలెక్షన్లతో గట్టి సమాధానం ఇచ్చారు.
టాలీవుడ్‌లో నిర్మాతలు చాలామంది ఉంటారు. కానీ తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్, క్రేజ్ క్రియేట్ చేసుకున్న నిర్మాతలు మాత్రం కొందరే కనిపిస్తారు. అందులో ముందు వరుసలో వినిపించే పేరు సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) అలియాస్ చింటూ. సినిమా మేకింగ్‌లోనే కాదు, ప్రమోషన్లలో కూడా ఆయన స్టైలే వేరు. మైక్ పట్టుకుంటే మనసులో ఏముందో ఓపెన్‌గా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటం నాగవంశీ నైజం. ఎవరి కోసమో మాట మార్చకుండా, డేరింగ్ అండ్ డాషింగ్‌గా స్టేట్‌మెంట్స్ ఇస్తూ సోషల్ మీడియాలో నిత్యం హాట్ టాపిక్‌గా నిలుస్తుంటారు. అందుకే ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక సెపరేట్ ఫాలోయింగ్ ఏర్పడింది.
ప్రేమమ్ సినిమాతో నిర్మాతగా తన జర్నీ మొదలుపెట్టిన నాగవంశీ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments) బ్యానర్‌ను టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా నిలబెట్టారు. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలతో పాటు భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూ ఏటా కనీసం మూడు నాలుగు రిలీజ్‌లతో థియేటర్లను కళకళలాడేలా చేస్తుంటారు. అయితే సినిమా పరిశ్రమలో గెలుపోటములు సహజం. ఎంతటి టాప్ ప్రొడ్యూసర్‌కైనా ఒక్కోసారి లెక్కలు తప్పుతుంటాయి. గతేడాది నాగవంశీకి కూడా కొన్ని ఊహించని ఎదురుదెబ్బలు తగిలాయి.
గతేడాది నాగవంశీ ఏకంగా నాలుగు సినిమాలకు నిర్మాతగా, మూడు క్రేజీ చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారు. ఇందులో డాకు మహారాజ్ (Daaku Maharaaj), మ్యాడ్ స్క్వేర్ (Mad Square) చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించి మంచి లాభాలను తెచ్చిపెట్టాయి. అలాగే కింగ్‌డమ్ (Kingdom), మాస్ జాతర (Mass Jathara) చిత్రాలు యావరేజ్ టాక్‌తో నెట్టుకొచ్చాయి. అయితే ఆయన భారీ ఆశలు పెట్టుకుని డిస్ట్రిబ్యూట్ చేసిన వార్-2 (War 2), రెట్రో (Retro) చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొట్టాయి. ఈ రెండు సినిమాలు భారీ నష్టాలను మిగల్చడంతో నాగవంశీకి పెద్ద దెబ్బే తగిలింది. ఇక లోకా చాప్టర్ 1 చిత్రం మాత్రం కొద్దిలో సేఫ్ జోన్‌లోకి వెళ్లి ఊరటనిచ్చింది.
గతేడాది వచ్చిన నష్టాలు, ఎదురైన విమర్శలను నాగవంశీ ఏమాత్రం లెక్కచేయలేదు. తన జడ్జిమెంట్‌పై పూర్తి నమ్మకంతో ఈ ఏడాది బరిలోకి దిగి బాక్సాఫీస్ వద్ద నిర్మాతగా తన సత్తా చాటుకున్నాడు. ఒకదాని వెనుక మరొకటిగా వరుస బ్లాక్‌బస్టర్లను ఖాతాలో వేసుకుంటూ ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరిచారు. ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగిన అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju) థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను కట్టిపడేసి ఏకంగా 100 కోట్ల క్లబ్‌లో చేరి భారీ లాభాలను అందించింది. జులైలో రిలీజైన లెనిన్ కూడా నాగవంశీ నమ్మకాన్ని నిలబెట్టింది. విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లి సునాయాసంగా 100 కోట్ల మార్కును అందుకుంది.
ఇక రీసెంట్‌గా వచ్చిన విశ్వనాథ్ అండ్ సన్స్ (Vishwanath & Sons) అయితే థియేటర్లలో రికార్డుల వేట మొదలుపెట్టింది. అద్భుతమైన కథనం, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఏకంగా 150 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి ఈ ఏడాది టాలీవుడ్ టాప్ గ్రాసర్లలో ఒకటిగా నిలిచింది. ఇదే ఏడాది వచ్చిన ఫంకీ (Funky) మాత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేక యావరేజ్ టాక్‌తో సరిపెట్టుకుంది. మొత్తానికి చూస్తే, గతేడాది పడ్డ ఎదురుదెబ్బలన్నింటికీ ఈ ఏడాది బాక్సాఫీస్ కలెక్షన్లతో నాగవంశీ గట్టి సమాధానం చెప్పారు. సరైన కంటెంట్‌ను ఎంచుకుంటూ, తనపై వచ్చే విమర్శలను లెక్కచేయకుండా ముందుకెళ్లే చింటూకు ఈ ఏడాది నిజంగా గోల్డెన్ ఇయర్ అనే చెప్పాలి. రాబోయే ప్రాజెక్టులతో నాగవంశీ బాక్సాఫీస్ వద్ద ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.