సాయిబాబా మందిరంలో 'వేదవ్యాస్‌' మూవీ బ్యానర్‌ ఆవిష్కరణ

ABN , Publish Date - Apr 23 , 2026 | 05:30 PM

కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మాణ సంస్థ 'సాయి ప్రగతి ఫిలిమ్స్' బ్యానర్‌ ఆవిష్కరణ ఫిల్మ్ నగర్‌ సాయిబాబా మందిరంలో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, చిత్ర సమర్పకులు కె. అచ్చిరెడ్డి కూడా పాల్గొన్నారు. వీరి కాంబినేషన్‌లో 'వేదవ్యాస్‌' చిత్రం తెరకెక్కుతోంది.

సీనియర్‌ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి (S.V. Krishna Reddy) ప్రస్తుతం 'వేదవ్యాస్‌' (Vedavyas) అనే సినిమాను రూపొందిస్తున్నారు. మాజీ శాసన సభ్యులు, కె.పి.ఆర్. ఐటీ విద్యాసంస్థల అధినేత, పారిశ్రామిక వేత్త కొమ్మూరి ప్రతాపరెడ్డి (Kommuri Pratap Reddy) నిర్మిస్తున్న ఈ సినిమాకు కె. అచ్చిరెడ్డి (K. Achhireddy) సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రతాపరెడ్డి 'సాయి ప్రగతి ఫిలిమ్స్' బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ నామకరణ కార్యక్రమం, బ్యానర్‌ ఆవిష్కరణ ఫిలిమ్‌ నగర్‌లోని సాయిబాబా మందిరంలో శాస్త్రోక్తంగా జరిగింది. దీనిని దర్శక నిర్మాతలు ముగ్గురు సంప్రదాయ దుస్తులు ధరించి హాజరు కావడం విశేషం. తమ ఇష్టదైవమైన సాయిబాబా సమక్షంలో ఈ ముగ్గురు ప్రముఖులు పంచకట్టులో కనిపిస్తున్న ఫోటోలు వారి ఫేస్ బుక్, వాట్సప్ గ్రూపులలో వైరల్ అవుతున్నాయి.


ఇదిలా ఉంటే... హైందవ ధర్మ విశిష్టతను తెలియచేస్తూ, సైంటిఫిక్ అప్రోచ్ కలిగిన సకుటుంబ సమేత కథాంశంతో ఎస్వీ కృష్ణారెడ్డి 'వేదవ్యాస్‌' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి తెలిపారు. ఈ సినిమాతో పిడుగు విశ్వనాథ్‌ (Pidugu Viswanadh) హీరోగా పరిచయం అవుతున్నారు. కొరియన్‌ నటి జూన్‌ హ్యూంజీ ఇందులో హీరోయిన్‌ కాగా, మంగోలియన్‌ నటుడు షరన్‌ బోల్డ్ సెగ్మెంట్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ సినిమాలో సాయికుమార్, సుమన్, బాబుమోహన్, శివాజీ రాజా, అలీ, ఉత్తేజ్ , రఘు బాబు అజయ్ ఘోష్ , ఐమాక్స్ వెంకట్, విద్యులేఖ, రాజేశ్వరి నాయర్ వంటి ప్రముఖ తారాగణం ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, కథనం, సంభాషణలు, సంగీతం, దర్శకత్వం ఎస్వీ కృష్ణారెడ్డి సమకూర్చుతున్నారు. భువనచంద్ర, వెనిగళ్ళ రాంబాబు పాటలు రాయగా, శరత్‌ సినిమాటోగ్రఫీని, సుచిత్ర కొరియోగ్రఫీని అందిస్తున్నారు.

Updated Date - Apr 23 , 2026 | 05:30 PM