Chadalavada Srinivasa Rao: షాబాద్ బాధిత దివ్యాంగురాలికి అండగా ఉంటా
ABN , Publish Date - Jul 11 , 2026 | 04:48 PM
నిర్మాతల చదలవాడ శ్రీనివాసరావు మరోసారి తన దయా గుణాన్ని చాటుకున్నారు.
నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు (Chadalavada Srinivasarao) మరోసారి తన దయా గుణాన్ని చాటుకున్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఇటీవల చోటుచేసుకున్న అమానుష హత్యాకాండపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, బాధిత కుటుంబంలో మిగిలిన దివ్యాంగురాలికి తన వంతు సహాయం అందిస్తానని ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు మాత్రమే కాదు.. ఇలాంటి విషాద సంఘటనలు జరిగినప్పుడూ సమాజం మానవతా దృక్పథంతో స్పందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. షాబాద్‌లో జరిగిన ఈ ఘటన సభ్య సమాజం తలదించుకునేంత దారుణమైనది. సమాజం సాంకేతికంగా, ఆర్థికంగా ఎంత అభివృద్ధి సాధించినా ఇలాంటి పాశవిక ఘటనలు మాత్రం ఆగడం లేదు. మనుషులు ఇంత క్రూరంగా ఎందుకు మారుతున్నారో అర్థం కావడం లేదు. ఈ సంఘటన నా మనసును తీవ్రంగా కలచివేసింది' అని అన్నారు. మరణించిన వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, బాధిత కుటుంబంలో మిగిలి ఉన్న దివ్యాంగురాలి పరిస్థితి తనను ఎంతో బాధించిందన్నారు. గ్రామ పెద్దలతో మాట్లాడి ఆమెకు అవసరమైన ఆర్థిక, సామాజిక సహాయాన్ని అందించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు.