అయ్యో.. ప్రియాంక 'వారణాసి' స్టోరీ లీక్ చేసిందిగా!
ABN , Publish Date - Feb 26 , 2026 | 06:38 AM
తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దర్శకధీరుడు రాజమౌళి, మన సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో ఒక అద్భుత దృశ్యకావ్యం సిద్ధమవుతోంది.
తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli), మన సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కాంబినేషన్‌లో ఒక అద్భుత దృశ్యకావ్యం సిద్ధమవుతోంది. వారణాసి అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ విజువల్ వండర్, శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ అలాగే ఎస్.ఎస్. కార్తికేయ నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోంది. దాదాపు 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం గురించి వచ్చే ప్రతి చిన్న వార్త సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
అయితే రీసెంట్‌గా వారణాసి చిత్రం గురించి హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka chopra) చేసిన వ్యాఖ్యలు గ్లోబల్ లెవల్‌లో వైరల్‌గా మారాయి. తన హాలీవుడ్ చిత్రం బ్లఫ్ ప్రమోషన్లలో భాగంగా ఒక అంతర్జాతీయ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, రాజమౌళి సినిమా గురించి అద్భుతమైన విషయాలను పంచుకుంది. వారణాసి సినిమా చూస్తున్నంత సేపు మనం కాలంతో పాటు, ప్రపంచమంతటా ప్రయాణిస్తున్నట్లు ఉంటుంది అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి. ఈ చిత్రం అత్యుత్తమ టైమ్ ట్రావెల్ యాక్షన్ అడ్వెంచర్‌గా నిలుస్తుందని ఆమె పేర్కొనడం విశేషం.
గతేడాది విడుదలైన గ్లింప్స్ ద్వారా రాజమౌళి సినిమా స్పాన్ ఏంటో చూపించినప్పటికీ, కథను మాత్రం గోప్యంగా ఉంచారు. ఇందులోని పాత్రల పేర్లు అదిరిపోయే రేంజ్‌లో సెట్ చేశాడు రాజమౌళి. రుద్రగా మహేష్, మందాకినిగా ప్రియాంక, కుంభగా పృద్వీరాజ్ సుకుమారన్..ఇలా పురాణాలకు సంబంధించిన పేర్లు పాత్రలకు ఉండటం, అలాగే రీసెంట్‌గా మహేష్ బాబు రాముడి గెటప్‌లో ఉన్న ఫోటోలు వైరల్ కావడంతో, ఈ అడ్వెంచర్ వెనుక మనం ఊహించిన దానికన్నా బలమైన మైథాలజీ కనెక్షన్ ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక బ్లఫ్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుండగా, గత కొన్నేళ్లుగా హాలీవుడ్ యాక్షన్ సినిమాలకే పరిమితమైన ప్రియాంక చోప్రా, వారణాసితో మళ్లీ ఇండియన్ స్క్రీన్‌పై గ్రాండ్‌గా మెరవబోతోంది. రాజమౌళి విజన్, మహేష్ బాబు ఇమేజ్ తోడవ్వడంతో ఈ ప్రాజెక్ట్ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, ప్రేక్షకులను ఒక సరికొత్త లోకంలోకి తీసుకెళ్లేలా ఈ టైమ్ ట్రావెల్ కథాంశం ఉండబోతోందని ప్రియాంక మాటల ద్వారా స్పష్టమవుతోంది. రాజమౌళి మ్యాజిక్, మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ కలిసి భారతీయ సినిమాను మరో మెట్టు ఎక్కించనున్నాయి.