Idupu Kayitham: ముక్కొస్తే.. లవ్ చెయ్యవా? టీజర్‌తోనూ అదరగొట్టారుగా
ABN , Publish Date - Nov 12 , 2026 | 12:18 PM
ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటించిన ఇడుపు కాయితం సినిమా అఫీసియల్ టీజర్ విడుదలైంది.
టాలెంటెడ్ హీరో ప్రియదర్శి (Priyadarshi Pulikonda), నాగదుర్గ (Naga Durga) జంటగా వంశీరెడ్డి దొండపాటి (Vamsi Reddy Dondapati) తెరకెక్కిస్తున్న చిత్రం ఇడుపు కాయితం (Idupu Kayitham). సుకుమార్ రైటింగ్స్ (Sukumar Writings), బన్నీ వాస్ వర్క్స్ (Bunny Vas Works ) సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన పాటలు, గ్లింప్స్ ఒకదానిని మించి మరోటి ఊహించని రీతిలో ప్రజాదరణను సొంతం చేసుకున్నాయి. అంతేగాక రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద చర్చకు దారితీసాయి. ఈ క్రమంలోనే మేకర్స్ తాజాగా టీజర్‌ను రిలీజ్ చేశారు. రామాయణం ఎక్కడ ఆగిపోతుంది అనుకుంటామో.. అక్కడ ఒక స్త్రీ ప్రవేశిస్తుంది అంటూ చాగంటి కోటేశ్వరరావు చెప్పిన మాటలతో టీజర్ మొదలు పెట్టి ఆసక్తికరంగా మలిచారు.
ఎంతో ఇష్టపడి శ్రీలతను పెళ్లి చేసుకుని కొన్నాళ్ల పాటు ఆనందంగా గడిపిన హీరో ఎందుకు ఇడుపు కాయితం రాసుకునే వరకు వచ్చాడనే పాయింట్‌తో ఇంట్రెస్టింగ్గా కట్ చేశారు. టీజర్లో కామెడీ, మ్యూజిక్ ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలను పెంచాయి. కాగా సినిమా కాస్త ఎస్వీ కృష్ణారెడ్డి ఆహ్వానం సినిమా కథలా ఉందేంటని పలువురు కామెంట్లు చేస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ ఇడుపు కాయితం సినిమా డిసెంబర్ 11న విడుదల కానుంది.