Hanuman 2: వైష్ణవ్ తేజ్‌తో హనుమాన్ 2.. అసలేం జరుగుతోంది
ABN , Publish Date - Nov 21 , 2026 | 11:21 AM
పెద్ద సినిమాలకు పోటీగా విడుదలై చిన్న సినిమాలు ఘన విజయాన్ని సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని నిరూపించిన చిత్రమే ‘హను-మాన్’.
పెద్ద సినిమాలకు పోటీగా విడుదలై చిన్న సినిమాలు ఘన విజయాన్ని సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని నిరూపించిన చిత్రమే ‘హను-మాన్’. ఆ ఘన విజయం అందించిన ఉత్సాహంతో ఒరిజినల్ నిర్మాతలైన ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ సంస్థ ఇప్పుడు భారతీయ సినీ చరిత్రలోనే మరో భారీ విజువల్ స్పెక్టకిల్‌ను అధికారికంగా ప్రకటించి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా, విలక్షణమైన కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను కట్టిపడేసే దర్శకుడు వి.ఐ. ఆనంద్ కాంబినేషన్లో సరికొత్త చిత్రం తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్‌కు పెట్టిన టైటిల్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అదే ‘హను-మాన్ 2 – ది రైజ్ ఆఫ్ వానరాస్’.
తాజాగా విడుదలైన ఈ చిత్ర అనౌన్స్మెంట్ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆకాశంలో దట్టమైన మేఘాల నడుమ సాక్షాత్తూ హనుమంతుడి భారీ రూపాన్ని తలపించే అద్భుతమైన నేపథ్యం ఒకవైపు కనిపిస్తుంటే.. మరోవైపు సంప్రదాయ పంచెకట్టులో నిలబడిన హీరో వైష్ణవ్ తేజ్‌ను భారీ వానరుడి తోక చుట్టుముట్టి ఆకాశంలోకి తీసుకెళ్తున్నట్లుగా చూపించిన విజువల్ ఆకట్టుకుంటోంది. దర్శకుడు వి.ఐ. ఆనంద్ అంటేనే సైన్స్ ఫిక్షన్, సూపర్ నేచురల్ థ్రిల్లర్లకు పెట్టింది పేరు. అలాంటి దర్శకుడి మార్క్ సైన్స్ ఫాంటసీకి, మన పురాణాల్లోని అద్భుతమైన వానర గాథల నేపథ్యాన్ని జోడించి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారా? అనే ఆసక్తి పోస్టర్‌తోనే మొదలైంది. కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ ప్రకటన వెలువడగానే సినీ ప్రియుల మదిలో ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలు, సందేహాలు మొదలయ్యాయి. ఎందుకంటే ‘హను-మాన్’ అనే అద్భుతాన్ని వెండితెరపై ఆవిష్కరించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆయన ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థతో కలిసి ‘జై హనుమాన్’ చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రంలో ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో కనిపించనుండగా, ఒరిజినల్ హీరో తేజ సజ్జా కూడా కీలక పాత్రలో కొనసాగనున్నారు.
ఇక్కడే అసలైన ఆసక్తికరమైన అంశం ఉంది. ఒకవైపు ‘హను-మాన్’ కథను సృష్టించి, తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి ‘జై హనుమాన్’ రూపొందిస్తుంటే.. మరోవైపు ఆ ఒరిజినల్ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించిన ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ సంస్థ ఇప్పుడు వైష్ణవ్ తేజ్‌తో నేరుగా ‘హను-మాన్ 2’ అంటూ టైటిల్ ప్రకటించడం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
దీంతో ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ‘జై హనుమాన్’ చిత్రానికి, ప్రైమ్‌షో నిర్మాతలు నిర్మించనున్న ‘హను-మాన్ 2’కు కథాపరంగా ఏమైనా సంబంధం ఉంటుందా? లేక టైటిల్ హక్కులు నిర్మాతల వద్ద ఉండటంతో ఇది పూర్తిగా స్వతంత్ర కథతో రూపొందనున్న చిత్రమా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఈ రెండు ప్రాజెక్టుల మధ్య సంబంధాలపై మేకర్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు.
ఒకవైపు ‘హను-మాన్’ చిత్రాన్ని తనదైన విజన్‌తో అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఉంటే.. మరోవైపు ఆ సినిమాను భారీ స్థాయిలో నిర్మించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ సంస్థ ఉంది. ఇప్పుడు ఈ రెండు ప్రాజెక్టుల ప్రకటనలతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. మరి ‘జై హనుమాన్’, ‘హను-మాన్ 2’ చిత్రాలు ఎలా ఉండబోతున్నాయి? వాటి మధ్య ఏమైనా సంబంధం ఉందా? భవిష్యత్తులో ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఒకదానికొకటి పోటీగా నిలుస్తాయా? అన్నది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.