Dragon: నీల్ మామ.. ఇదేం ఫాంటసీ అయ్యా నీకు! అప్పుడు కేజీఎఫ్, సలార్.. ఇప్పుడు డ్రాగన్
ABN , Publish Date - Nov 17 , 2026 | 11:00 AM
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాపై భారీ అప్డేట్ వైరల్ అవుతోంది.
టాలీవుడ్లోనే కాకుండా యావత్ భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న కాంబినేషన్లలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR), సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ప్రాజెక్ట్ టాప్‌లో ఉంటుంది. వీరిద్దరి కలయికలో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్ (Dragon) గురించి ఫిలింనగర్ వర్గాల్లో ఒక బిగ్గెస్ట్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న అంచనాలు, పెట్టిన బడ్జెట్ లెక్కలు చూస్తుంటే మూవీ లవర్స్‌కు మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. అసలు ‘డ్రాగన్’ చుట్టూ జరుగుతున్న ఆ సంచలన మార్పులేంటి? తెరవెనుక ప్రశాంత్ నీల్ వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏమిటి..?
నిజానికి ఈ చిత్రం ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం ఏడాది ఆలస్యంగా నడుస్తోంది. అటు ఎన్టీఆర్ కమిట్మెంట్స్, ఇటు ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్ వర్క్ కారణంగా ఆలస్యమైనప్పటికీ, ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా చిత్రీకరణ జరుపుతున్నారు. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఎన్టీఆర్ క్రేజ్, ప్రశాంత్ నీల్ బ్రాండ్ వాల్యూకు ఏమాత్రం తగ్గకుండా నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాపై కనీవినీ ఎరుగని రీతిలో భారీగా ఖర్చు చేస్తున్నారు. చెప్పాలంటే, హీరో, దర్శకుడి ప్రస్తుత మార్కెట్ పరిధిని దాటి మరీ భారీ బడ్జెట్‌ను రంగంలోకి దించినట్లు టాక్. పెట్టిన బడ్జెట్ తిరిగి రావడమే కాకుండా, ప్రేక్షకులకు ఒక అద్భుతమైన విజువల్ ఎక్స్పీరియన్స్ అందించాలనే ఉద్దేశంతో మేకర్స్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అదేంటంటే.. డ్రాగన్ చిత్రాన్ని ఒకే భాగంగా కాకుండా, రెండు భాగాలుగా విడుదల చేయాలని ప్రశాంత్ నీల్ గట్టిగా ప్లాన్ చేశారు. కేజీఎఫ్, సలార్ చిత్రాలతో పార్ట్స్ కాన్సెప్ట్‌ను బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ చేసిన ప్రశాంత్ నీల్, డ్రాగన్ కోసం రాసుకున్న ప్రపంచం చాలా విస్తృతమైనది. కేవలం మూడు గంటల్లో ఆ కథను పూర్తి చేయడం కష్టం. అందుకే కథను రెండు భాగాలుగా విస్తరించి, మొదటి భాగాన్ని జూన్ 2027లో భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత కథను ముగించే రెండో భాగాన్ని 2028లో విడుదల చేసే విధంగా ప్రీ-ప్రొడక్షన్, షూటింగ్ షెడ్యూల్స్‌ను పక్కాగా సిద్ధం చేస్తున్నారు. సరైన సమయం చూసి చిత్ర యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనుంది.
ఇక సినిమా ప్రొడక్షన్ విషయానికి వస్తే, ఇటీవల గాయపడిన ఎన్టీఆర్ పూర్తిగా కోలుకుని పూర్తి ఎనర్జీతో సెట్స్‌లో అడుగుపెట్టారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన భారీ సెట్లో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ తో పాటు కథానాయికగా నటిస్తున్న రుక్మిణి వసంత్ కూడా పాల్గొంటున్నారు. వీరిద్దరిపై వచ్చే డ్రామా, రొమాంటిక్ సన్నివేశాలతో పాటు కొన్ని కీలక సీక్వెన్స్‌లను దర్శకుడు చిత్రీకరిస్తున్నారు. సెట్స్‌లో ఎన్టీఆర్ ఎనర్జీ చూసి యూనిట్ సభ్యులు ఆశ్చర్యపోతున్నారని సమాచారం.
ఈ సినిమాలో నటీనటుల ఎంపిక కూడా పాన్ ఇండియా రేంజ్లో అదిరిపోయింది. బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్, మలయాళ విలక్షణ నటుడు బిజూ మీనన్, అలాగే అశుతోష్ రాణా, ఖుష్బూ లాంటి భారీ తారాగణం ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరందరి పాత్రలు కథ మలుపు తిరిగే సమయంలో ఎంతో బలంగా ఉంటాయని తెలుస్తోంది. దీనికితోడు కేజీఎఫ్, సలార్ చిత్రాలకు పనిచేసిన టాప్ టెక్నికల్ టీమ్ డ్రాగన్ కోసం పనిచేస్తుండటంతో సాంకేతికంగా కూడా ఈ చిత్రం సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేయబోతోంది.