శృతి తప్పితేనే ఊరుకోను.. గతి తప్పావు! ఆకట్టుకుంటున్న ప్రకాశ్ రాజ్ ‘జగమే సంగీతం’ ట్రైలర్
ABN , Publish Date - Aug 25 , 2026 | 10:48 PM
తెలుగు ఓటీటీ ప్రేక్షకుల కోసం ప్రైమ్ వీడియో మరో ఆసక్తికరమైన ఒరిజినల్ సిరీస్‌ను తీసుకొస్తోంది.
‘జగమే సంగీతం’ ట్రైలర్ విడుదల.. మనసును తాకే సంగీతం, హృదయాలను కదిలించే భావోద్వేగాలు
తెలుగు ఓటీటీ ప్రేక్షకుల కోసం ప్రైమ్ వీడియో మరో ఆసక్తికరమైన ఒరిజినల్ సిరీస్‌ను తీసుకొస్తోంది. ‘జగమే సంగీతం’ పేరుతో రూపొందిన ఈ మ్యూజికల్ ఫ్యామిలీ డ్రామా ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. కర్ణాటక సంగీతం నేపథ్యంగా, కుటుంబ బంధాలు, ప్రేమ, వారసత్వం, ఆత్మశోధన వంటి అంశాలను హృద్యంగా మిళితం చేసిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. గతంలో మంచి ఆదరణ పొందిన హిందీ ఒరిజినల్ సిరీస్ ‘బందిష్ బాండిట్స్’ స్ఫూర్తితో రూపొందిన ఈ తెలుగు వెర్షన్‌కు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సుష్మిత కొణిదెల నిర్మించారు. ఎనిమిది ఎపిసోడ్‌లుగా రూపొందిన ఈ సిరీస్‌కు వంగాల సూర్య మనోజ్, శ్రావణి సముద్రాల, ఎ.ఆర్. ప్రభావ్ కథ, కథనం అందించగా.. విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూర్చారు.
సంగీతం చుట్టూ తిరిగే భావోద్వేగ కథ
ట్రైలర్ ప్రారంభంలో తణికెళ్ల భరణి వాయిస్ ఓవర్‌తో వినిపించే “ఇదే మన వైకుంఠపురం.. ముప్పై ఏళ్ల తర్వాత సంగీత భారతిని నిర్ణయించే సమయం వచ్చింది” అనే డైలాగ్ ఆసక్తిని పెంచుతుంది. అనంతరం ప్రకాష్ రాజ్ చెప్పిన “స్వచ్ఛమైన సంగీతమే నా ఉచ్ఛ్వాసం, నిశ్వాసం” అనే మాటలు కథలో సంగీతానికి ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తాయి. శాస్త్రీయ సంగీత సంప్రదాయాన్ని కాపాడాలనుకునే శాస్త్రి పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపిస్తుండగా.. అతని ఆలోచనలకు విరుద్ధంగా నడిచే కొత్త తరం మధ్య తలెత్తే సంఘర్షణ కథలో ప్రధాన ఆకర్షణగా కనిపిస్తోంది. “సంగీతం అనేది వారసత్వం కాదు.. వరం”, “స్వచ్ఛమైన సంగీతం, నిజమైన ప్రేమ పారదర్శకంగా ఉంటాయి” వంటి డైలాగ్‌లు ట్రైలర్‌కు ప్రత్యేక బలం చేకూర్చాయి.
వైకుంఠపురం అనే దేవాలయ పట్టణం నేపథ్యంలో సాగే ఈ కథలో ప్రముఖ సంగీత విద్వాంసుడు శాస్త్రి మనవడు బాలు తన సొంత గుర్తింపును వెతుక్కుంటూ ముందుకు సాగుతాడు. మరోవైపు కీర్తి, గ్లామర్ ప్రపంచం నుంచి బయటపడాలని కోరుకునే పాప్ స్టార్ పల్లవి జీవితంలోకి అతను ప్రవేశిస్తాడు. వారి పరిచయం ప్రేమగా మారడం, కుటుంబాల మధ్య ఉన్న విభేదాలు బయటపడటం, దాగివున్న నిజాలు వెలుగులోకి రావడం కథను మరింత ఆసక్తికరంగా మార్చనున్నట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది. కుటుంబ బంధాలు, ప్రేమ, త్యాగం, వ్యక్తిత్వ అన్వేషణ చుట్టూ సాగే ఈ కథలో సంగీతం కీలక పాత్ర పోషించనుంది. ఈ సిరీస్‌లో ప్రకాష్ రాజ్, మేక శ్రీకాంత్, మధుబాల, అక్షయ్ లగుసాని, సుష్మిత శెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. సుమన్, సిజ్జు మీనన్, షఫీ, ఝాన్సీ, రఘుబాబు, రాకెట్ రాఘవ, నాగి జబర్దస్త్, మిర్చి కిరణ్, కేశవ్ దీపక్, ప్రియాంక నల్కరి, మాణిక్ రెడ్డి, ప్రాచీ థాకర్, రూపా లక్ష్మి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ మాట్లాడుతూ, ‘‘ఈ కథకు కర్ణాటక సంగీతం ఒక భావోద్వేగ భాషలా మారింది. ప్రేమ, ఆశయం, గుర్తింపు, కుటుంబ బంధాల గురించి చెప్పే ఈ కథలో ప్రతి పాత్ర ప్రేక్షకులను కదిలిస్తుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం కథకు ప్రాణం పోసింది’’ అని తెలిపారు. శాస్త్రి పాత్ర గురించి ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ, ‘‘ఈ పాత్రలోని క్రమశిక్షణ, వారసత్వాన్ని కాపాడాలనే తపన నన్ను ఆకర్షించాయి. సంగీతం మనుషులను ఎలా కలుపుతుందో, విడదీస్తుందో చూపించే కథ ఇది. ప్రేక్షకులు ఈ పాత్రల భావోద్వేగ ప్రయాణంతో మమేకమవుతారని నమ్ముతున్నాను’’ అన్నారు. మధుబాల మాట్లాడుతూ, ‘‘ప్రతి కుటుంబంలో ఉండే ప్రేమ, అపార్థాలు, త్యాగాలను ఈ కథ ఎంతో సహజంగా చూపిస్తుంది. సంగీతం కథకు బలం అయినా.. చివరకు మనసులో నిలిచేది పాత్రల మధ్య ఉన్న బంధాలే’’ అని పేర్కొన్నారు.
స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘జగమే సంగీతం’ సెప్టెంబర్ 4, 2026 నుంచి ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాలు, ప్రాంతాల్లో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు భాషలో ఆంగ్ల సబ్‌టైటిల్స్‌తో పాటు తమిళ డబ్బింగ్‌లో కూడా అందుబాటులోకి రానుంది. కర్ణాటక సంగీత వైభవాన్ని, కుటుంబ భావోద్వేగాలను, ఆధునిక ప్రేమకథను ఒకే వేదికపై ఆవిష్కరిస్తున్న ‘జగమే సంగీతం’ ట్రైలర్ చూస్తుంటే.. సంగీత ప్రియులకు ఇది ప్రత్యేక అనుభూతిని అందించే సిరీస్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.