ఇంత సిగ్గు లేకుండానా.. రావణ్ కేసుపై ప్రకాష్ రాజ్ ఫైర్

ABN , Publish Date - Jul 04 , 2026 | 02:54 PM

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో యూట్యూబర్ రావణ్‌ (Ravan)ను వరుస కేసులతో అరెస్ట్ చేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెల్సిందే.

Prakash Raj

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో యూట్యూబర్ రావణ్‌ (Ravan)ను వరుస కేసులతో అరెస్ట్ చేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెల్సిందే. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లో పిఠాపురం పోలీసులు రావణ్‌ను అరెస్ట్ చేయగా, కులమతాలను రెచ్చగొట్టారంటూ జనసేన నాయకుల ఫిర్యాదుల మేరకు ఇప్పటికే మూడు చోట్ల ఆయనను అరెస్ట్ చేయగా వరుసగా బెయిల్ లభించింది. అయినప్పటికీ పోలీసులు మళ్లీ మళ్లీ ఇతర పాత కేసులను తెరపైకి తెచ్చి అతనిని వేధించడంపై నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj) ఫైర్ అయ్యాడు. ప్రభుత్వం కేవలం కక్ష సాధింపు చర్యల కోసమే ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఆరోపించాడు.


'ఏంటీ నాటకం, దౌర్జన్యం? ఒక కేసులో అరెస్ట్ చేస్తారు.. కోర్టు బెయిల్ ఇస్తుంది. మళ్లీ ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారు.. మళ్లీ కోర్టు బెయిల్ ఇస్తుంది. ఇలా వరుసగా అరెస్ట్ చేయడం, కోర్టులు బెయిల్ ఇవ్వడం చూస్తుంటే కోర్టు ఏం చెబుతోందో మీకు అర్థం కావడం లేదా? మీరు పెడుతున్నవి తప్పుడు కేసులు, అరెస్ట్ చేయొద్దని కోర్టులు చెబుతున్నా వినరా? ఇదేనా ప్రజాస్వామ్యం? ప్రజల కోసం ఇందుకేనా అధికారంలోకి వచ్చింది? ఏంటీ కక్ష సాధింపు?..


ఇంత ఓపెన్‌గా, ఇంత సిగ్గు లేకుండా, ఇంత అహంకారమా? గత నాలుగు రోజులుగా రావణ్ నిరాహార దీక్షలో ఉన్నా ప్రభుత్వం కనీసం ఆలోచించడం లేదు. కోర్టు మాటలను కూడా గౌరవించడం లేదు. ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు, ఆంధ్రా పోలీసులు, ప్రభుత్వం ఆలోచించాలి. దేశం మొత్తం ఈ పరిణామాలను చూస్తోందని, మీరు చేస్తోంది ముమ్మాటికీ తప్పు.. తప్పు.. తప్పు' అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Updated Date - Jul 04 , 2026 | 03:06 PM