ప్రదీప్ రావత్ చివరి కోరిక.. తీరుతుందా

ABN , Publish Date - Aug 06 , 2026 | 04:23 PM

విలనిజానికి కొత్త అర్థం చెబుతూ, తెలుగు తెరపై భయంకరమైన పాత్రలతో పాటు ఎమోషనల్, కామెడీ రోల్స్‌తో ప్రేక్షకులను అలరించిన నటుడు ప్రదీప్ రావత్.

Pradeep Rawat

విలనిజానికి కొత్త అర్థం చెబుతూ, తెలుగు తెరపై భయంకరమైన పాత్రలతో పాటు ఎమోషనల్, కామెడీ రోల్స్‌తో ప్రేక్షకులను అలరించిన నటుడు ప్రదీప్ రావత్ (Pradeep Rawat). బాడీ లాంగ్వేజ్‌తోనే శత్రువులకు వణుకు పుట్టించే ప్రదీప్ రావత్, టాలీవుడ్‌లో ఎన్నో ఐకానిక్ పాత్రలకు ప్రాణం పోశారు. సై చిత్రంలోని భిక్షు యాదవ్ పాత్రను ఎవరూ మరచిపోలేరు. అలాగే రవితేజ భద్ర చిత్రంలో ఆయన పోషించిన మాస్ విలన్ పాత్ర భయాన్ని కలిగిస్తే, రామ్ పోతినేని నేను శైలజ చిత్రంలో లవ్ ఫెయిల్ అయిన రౌడీగా నవ్వులు పూయించారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ఆయన నటన ప్రత్యేక ముద్ర వేసింది. హిందీలో అమీర్ ఖాన్ సరసన బ్లాక్‌బస్టర్ మూవీ గజినీ సినిమా ఆయనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ని సంపాదించిపెట్టింది.


మరెన్నో మంచి సినిమాలతో అలరిస్తారు అనుకున్న ప్రదీప్ రావత్ ఆకస్మికంగా కన్నుమూయడం సినీ వర్గాలను, అభిమానులను తీవ్ర విషాదంలో నెట్టింది. ఇక ప్రదీప్ చివరి కోరిక తీరకుండానే మరణించినట్లు బాలీవుడ్ మీడియా కోడైకూస్తోంది. తన కుమారుడు విక్రమ్ రావత్‌ను వెండితెరకు హీరోగా పరిచయం చేయాలనేది ఆయన చిరకాల కోరిక. ఆ ఆశ తీరకుండానే ఆయన ఆకస్మికంగా కన్నుమూశారు. ఎక్కడికి వెళ్ళినా కొడుకును తీసుకెళ్ళి ఇండస్ట్రీ పెద్దలకు పరిచయం చేసేవారట ప్రదీప్. తన కొడుకు విజయాన్ని కళ్ళారా చూడాలని ఆశపడ్డారట.


తన నట వారసత్వాన్ని అందిస్తూ కుమారుడు విక్రమ్ రావత్‌ను హీరోగా లాంచ్ చేయాలని ఆయన ఎన్నో ప్లాన్స్ చేసుకున్నారు. కానీ ఆ కల నెరవేరకముందే ఆయన దూరమయ్యారు.తండ్రి అంత్యక్రియాల్లో విక్రమ్ పైనే అందరి చూపు ఉంది. తండ్రి నీడలో కెరీర్ ని మొదలుపెట్టి ఎదగాలనుకున్న సమయంలోనే ఇలా జరగడం అతడి మనసును తీవ్రంగా కలిచివేసింది. విక్రమ్ లుక్.. హీరోలానే కనిపిస్తుంది. బాలీవుడ్ డెబ్యూకి పర్ఫెక్ట్ లుక్, ఏజ్.. కానీ, తండ్రి లేకుండా ఇండస్ట్రీలో ఒక్కడే ఎదగగలడా అంటే కష్టమే అని అంటున్నారు. మరి తండ్రి చిరకాల కోరికను విక్రమ్ నెరవేరుస్తాడా.. ? లేదా అనేది చూడాలి.

Updated Date - Aug 06 , 2026 | 04:24 PM