డార్లింగ్స్... రీచార్జ్ అయ్యొస్తా! వెకేషన్‌కు.. ప్రభాస్‌

ABN , Publish Date - Apr 02 , 2026 | 05:15 PM

ఓ పక్క స్పిరిట్‌, మరోపక్క ఫౌజీ ఇలా రెండు పడవల మీద ప్రయాణం చేస్తూ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న డార్లింగ్ ప్ర‌భాస్ సినిమాల‌కు స‌మ్మ‌ర్ బ్రేక్ ఇచ్చారు.

Prabhas

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas).. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈయన పేరే మారుమోగుతోంది. సలార్ (Salaar: Part 2), కల్కి 2898 AD (Kalki 2 Part 2) సినిమాలతో వరల్డ్ వైడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రభాస్, ఇప్పుడు గ్యాప్ లేకుండా తన తదుపరి సినిమాలను లైన్‌లో పెట్టేశారు. కానీ, గత కొద్ది రోజులుగా సైలెంట్‌గా ఉన్న డార్లింగ్, తాజాగా ఒక భారీ ప్లాన్‌తో వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ప్రభాస్ ఎక్కడున్నారో తెలుసా..? ఈ సమ్మర్ హీట్ నుంచి తప్పించుకోవడానికి, తనను తాను రీఛార్జ్ చేసుకోవడానికి డార్లింగ్ ఇటలీ (Italy) వెళ్లిపోయాడు.

ఏడాది కాలంగా ప్రభాస్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఓ పక్క స్పిరిట్‌ (Spirit), మరోపక్క ఫౌజీ (Fauzi).. ఇలా రెండు పడవల మీద ప్రయాణం చేస్తూ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చేందుకు అహర్నిశలు శ్రమించారు. అందుకే, ఈ చిన్న వెకేషన్ బ్రేక్. షూటింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాని ప్రభాస్, ఈ సమ్మర్ బ్రేక్ తర్వాత మరింత ఎనర్జీతో సెట్స్ మీదకు రాబోతున్నారు. ఈ ఇటలీ ట్రిప్ కేవలం సరదా కోసం మాత్రమే కాదు, రాబోయే భారీ ప్రాజెక్టుల కోసం ప్రభాస్ మైండ్‌ను ఫ్రెష్‌గా ఉంచుకునేందుకేనని ఇన్ సైడ్ టాక్..!

హను రాఘవపూడి దర్శకత్వంలో రాబోతున్న 'ఫౌజీ' చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. యుద్ధ నేపథ్యంతో సాగే ఈ లవ్ స్టోరీలో ప్రభాస్ లుక్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఈ ఏడాది చివరలో ఈ చిత్రం థియేటర్లకు రాబోతోంది. కానీ, అసలైన విధ్వంసం వచ్చే ఏడాది మార్చిలో సందీప్ రెడ్డి వంగా - ప్రభాస్ కాంబోలో రాబోతున్న స్పిరిట్ (Spirit) సినిమాతో రానుంది. ఈ సినిమాలో ప్రభాస్ కరుడుగట్టిన పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. వంగా మార్క్ వైలెన్స్, ప్రభాస్ మార్క్ యాక్షన్ కలిస్తే బాక్సాఫీస్ దగ్గర రికార్డులు గల్లంతే..! ఈ రెండు సినిమాల షూటింగ్స్ ప్యారలల్‌గా జరుగుతుండటం ప్రభాస్ డెడికేషన్‌కు నిదర్శనం.

ఇక ఇండియాస్ బిగ్గెస్ట్ విజువల్ వండర్ కల్కి సీక్వెల్ గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు నాగ్ అశ్విన్ ఆల్రెడీ రంగంలోకి దిగిపోయారు. ప్రభాస్ వెకేషన్‌లో ఉన్నా కూడా, ఆయనతో సంబంధం లేని కీలకమైన సీన్లను నాగ్ అశ్విన్ చకచకా పూర్తి చేస్తున్నారు. ఇక పార్ట్-2 లో అసలైన విజువల్ ట్రీట్ ఏంటంటే.. లోకనాయకుడు కమల్ హాసన్, యాస్కిన్‌గా పూర్తిస్థాయి విలన్‌గా విరుచుకుపడబోతున్నారు.

ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య వార్ ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. స్పెషల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్‌తో ఈ సినిమా ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించబోతోంది. ఇప్పుడు ప్రభాస్ తీసుకున్న ఈ చిన్న బ్రేక్, రాబోయే పెద్ద సునామీకి ముందు వచ్చే నిశ్శబ్దం మాత్రమే. సమ్మర్‌ ముగియగానే వరుస సినిమా షూటింగ్‌లతో ప్రభాస్‌ మళ్లీ బిజీగా కానున్నాడు.

Updated Date - Apr 02 , 2026 | 05:30 PM