తమిళ, మలయాళ దర్శకులతో ప్రభాస్!
ABN , Publish Date - Mar 16 , 2026 | 11:40 AM
హోంబలే ఫిల్మ్స్‌లో ప్రభాస్ మూడు సినిమాలకు అంగీకరించిన విషయం తెలిసిందే. అందులో 'సలార్ 2' ఒకటి కాగా, మరొకటి తమిళ దర్శకుడితోనూ, ఇంకోటి మలయాళ దర్శకుడితోనూ ఉంటాయని వార్తలు వస్తున్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) కు ఉన్న క్రేజ్ వేరు. 'బాహుబలి' (Baahubali) తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తర్వాత అతని సినిమాల జయాపజయాలతో నిమిత్తం లేకుండా వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ప్రభాస్ ఎంత ఆచితూచి సినిమాలు చేస్తున్నా... కొన్ని అనివార్య కారణాల వల్ల వాటి విడుదలలో జాప్యం జరుగుతోంది. ఈ యేడాది సంక్రాంతికి విడుదలైన 'ది రాజా సాబ్' (The Raja Saab) ఆశించిన స్థాయిలో లేకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇప్పుడు వారందరి దృష్టి దసరా కానుకగా, అక్టోబర్ 15న విడుదల కానున్న 'ఫౌజీ' (Fauzi) మీద ఉంది. హను రాఘవపూడి తప్పనిసరిగా ప్రభాస్‌ను సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తాడని వారంతా నమ్ముతున్నారు. ఇదే సమయంలో క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా... ప్రభాస్‌తో తీస్తున్న 'స్పిరిట్' (Spirit) మూవీని వచ్చే యేడాది మార్చి 27న విడుదల చేస్తామని చెప్పారు. ఇక అదే యేడాది 'కల్కి 2898 ఎ.డి.' (Kalki 2898 ఎ.డి.) సీక్వెల్ సైతం వచ్చే ఆస్కారం ఉంది.
ఇదిలా ఉంటే ప్రభాస్ హోంబలే ఫిల్మ్స్ సంస్థతో మూడు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకున్నాడనేది అందరికీ తెలిసింది. అందులో ఒకటి 'సలార్ 2: శౌర్యంగ పర్వం' కాగా మరో రెండు సినిమాల వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఈ రెండు సినిమాలను ఇద్దరు పరభాషా దర్శకులు టేకప్ చేస్తారన్నది ఫిల్మ్ నగర్ సమాచారం.
ప్రభాస్ కెరీర్ ప్రారంభం నుండి పరభాషా దర్శకులతో సినిమాలు చేస్తూనే ఉన్నారు. అతని రెండో సినిమానే తమిళుడైన సురేశ్ కృష్ణతో చేశాడు. అదే 'రాఘవేంద్ర'. అలానే ప్రభుదేవాతో 'పౌర్ణమి', ఎ. కరుణాకరన్‌తో 'డార్లింగ్', రాఘవేంద్ర లారెన్స్‌తో 'రెబల్' చిత్రాలను చేశాడు. వీరంతా తమిళులే. ఇక హిందీలో ఓంరౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్'లో నటించాడు. అలానే కన్నడిగ అయిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో 'సలార్'లో నటించాడు. ఇక ఆ మధ్య ముఖేశ్ కుమార్ డైరెక్ట్ చేసిన 'కన్నప్ప'లోనూ ఓ కీలక పాత్రను పోషించి మెప్పించాడు ప్రభాస్. ఇక హోంబొలే ఫిలిమ్స్ నిర్మించే మరో రెండు సినిమాలలో ఒకరు తమిళ దర్శకుడు కాగా మరొకరు మలయాళ దర్శకుడు.
మలయాళంలో 'కిష్కింద కాండ', 'ఎకో' చిత్రాలను డైరెక్ట్ చేసిన దింజిత్ అయ్యధాన్ ప్రభాస్ కోసం ఓ కథను సిద్ధం చేశారట. అలానే తమిళ చిత్రం 'అమరన్' ఫేమ్ రాజ్ కుమార్ పెరియసామి కూడా ఇటీవల ప్రభాస్‌కు కథను చెప్పారట. ఈ రెండు కథలు ప్రభాస్‌కు బాగా నచ్చాయని, వారితో అతను సినిమా చేయడానికి సిద్థంగా ఉన్నారని, హోంబలే ప్రొడక్షన్స్‌లో ప్రభాస్ చేసే రెండు సినిమాలు ఇవేనని తెలుస్తోంది. మరి వీటిల్లో ఏది ముందు సెట్స్ పైకి వెళుతుందో చూడాలి.