'సింగ్ గీతం' కోసం ప్రభాస్ గానం
ABN , Publish Date - Jun 21 , 2026 | 07:07 PM
94 ఏళ్ల వయసులో సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్ గీతం' చూసిన ప్రభాస్ ఫిదా అయ్యారట. నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ మూవీపై ఆసక్తికర చర్చ సాగుతోంది.
అందరూ ఈ రోజు చేసే దానిని సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasa Rao) ఇరవై ఏళ్ళ క్రితమే ఆలోచించి ఉంటారని తెలుగు చిత్రసీమలో ఓ సామెత ఉంది. ఆయన ఆలోచనలు రెండు తరాలకు ముందుగా ఉంటాయనీ అంటూ ఉంటారు. సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ళ వయసులో సింగ్ గీతం (Sing Geetham) అనే సినిమా రూపొందించి వార్తల్లో నిలిచారు. మన దేశంలో ఇంత వయసులో సినిమా తీసిన మరో దర్శకుడు లేరనే చెప్పాలి. ఈ చిత్రాన్ని క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించడం విశేషం. ప్రస్తుతం నాగ్ అశ్విన్ (Nag Ashwin) తన కల్కి (Kalki 2898 AD) సీక్వెల్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. తన హీరో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ను 'సింగ్ గీతం' చూడమని నాగ్ అశ్విన్ కోరారు. ప్రభాస్ 'సింగ్ గీతం' సినిమా చూసి అందులో తనను ఎందుకు పెట్టలేదని డైరెక్టర్ ను అడిగారు. ప్రస్తుతం ఆ టాపిక్ హల్చల్ చేస్తోంది.
సింగీతం.. ద గ్రేటెస్ట్
'సింగ్ గీతం' సినిమా చూసి ప్రభాస్ ఫిదా అయిపోయారు. అసలు అలాంటి ఓ వరైటీ మూవీలో తనను ఎంచుకోనందుకు కాసింత కినుక వహించారు. అర్ధరాత్రి పూటయినా సింగీతం శ్రీనివాసరావుకు వాయిస్ మెసేజ్ పెట్టి అభినందించారు. ఇదంతా తన 'కల్కి' డైరెక్టర్ నాగ్ అశ్విన్ కోసం ప్రభాస్ చేసిందే అని కొందరు అంటున్నారు. మరికొందరు ఆ సినిమా ప్రభాస్ ను ఆకట్టుకున్నట్టే ఉందనీ చెబుతున్నారు. అందుకే ఈ సినిమాను తెరకెక్కించిన తీరును అడిగి తెలుసుకున్నారనీ ఈ వీడియో చూసిన వారు భావిస్తున్నారు.
'కల్కి' సీక్వెల్ పై ఆసక్తి..
'సింగ్ గీతం' మూవీకి విమర్శకుల ప్రశంసలు పుష్కలంగా లభిస్తున్నాయి. ఈ మూవీని నిర్మించిన నాగ్ అశ్విన్ అభిరుచినీ పలువురు ప్రశంసిస్తున్నారు. ఇదే సమయంలో ప్రభాస్ సినిమా చూసి అభినందించిన తీరూ ఆకట్టుకుంటోంది. ఈ సందడి ఇలా ఉంటే ప్రభాస్ తో నాగ్ అశ్విన్ 'కల్కి' సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ లో ఇంట్రెస్ట్ మొదలయింది. 'కల్కి' సీక్వెల్ కంటే ముందే ప్రభాస్ నటించిన 'ఫౌజీ', 'స్పిరిట్' వస్తాయి. ఆ తరువాతే 'కల్కి' ఆగమనం. తొలి భాగంతో సూపర్ హిట్ కొట్టేసిన నాగ్ అశ్విన్ రెండో భాగంతో ఏ తీరున మురిపిస్తారో అన్న ఆసక్తి ఫ్యాన్స్ లో చోటు చేసుకుంది. 'సింగ్ గీతం' స్ఫూర్తితో 'కల్కి' సీక్వెల్ లో ప్రభాస్ తో పాట పాడిస్తారేమో చూడాలి.