జోరు పెంచిన ప్రభాస్.. తీరిక లేకుండా షూటింగ్స్
ABN , Publish Date - Feb 25 , 2026 | 07:09 AM
ఇటీవలే విడుదలైన రాజాసాబ్‌తో ప్రేక్షకులను పలకరించారు ప్రభాస్. ప్రస్తుతం ‘ఫౌజీ’, ‘స్పిరిట్’, ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ చిత్రాల్లో నటిస్తున్నారు.
ఇటీవలే విడుదలైన రాజాసాబ్‌తో ప్రేక్షకులను పలకరించారు ప్రభాస్ (Prabhas). ప్రస్తుతం ‘ఫౌజీ’ (Fauzi), ‘స్పిరిట్’ (Spirit), ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2)సీక్వెల్ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో ముందుగా విడుదలయ్యే సినిమా ‘ఫౌజీ’. పీరియాడిక్ కథాంశంగా హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే 75 శాతం పూర్తైంది. కేవలం కొన్ని కీలక సన్నివేశాల షూట్ మాత్రమే మిగిలి ఉండడంతో వాటిని అతి త్వరగా పూర్తి చేసి.. సినిమాను దసరా సందర్భంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఇందులో దేశం కోసం పోరాడే సైనికుడి పాత్రలో ప్రభాస్ కనిపించనున్నట్లు సమాచారం. సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ‘స్పిరిట్’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది మార్చి 5న విడుదలవుతోంది. ఇప్పటికే ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ చిత్రీకరణ ప్రారంభం అయింది. త్వరలోనే తను నటించే సన్నివేశాల చిత్రీకరణలో భాగం అవ్వనున్నారు ప్రభాస్.
ఇదిలాఉంటే.. ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం సీక్వెల్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. తాజాగా ఈ చిత్రీకరణ సెట్స్‌లో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మంగళవారం ఈ చిత్రం షూటింగ్‌లో కమల్‌హాసన్ (Kamal Haasan), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) పాల్గొన్నారు. చాలా కాలం తర్వాత కమల్‌హాసన్‌తో కలసి పనిచేస్తుండడంతో ఆనందంతో ఆయనను ఆలింగనం చేసుకున్నారు అమితాబ్. ఈ ఫొటోలను తన బ్లాగ్‌లో షేర్ చేశారు. ‘గిరఫ్తార్’ తర్వాత దాదాపు 40 ఏళ్లకు వీరిద్దరూ కలసి నటిస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్.