Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కు.. డబుల్ బొనాంజా! దసరాకు 'ఫౌజీ'
ABN , Publish Date - Jan 29 , 2026 | 04:41 PM
ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ప్రభాస్ ఫౌజీ చిత్రం దసరా కానుకగా రాబోతోంది. షూటింగ్ పూర్తయ్యే వరకూ షెడ్యూల్ ను కొనసాగిస్తామని చిత్ర దర్శకుడు హను రాఘవపూడి, నిర్మాతలు నవీన్, రవిశంకర్ తెలిపారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ యేడాది సంక్రాంతి కానుకగా 'ది రాజాసాబ్'తో జనం ముందుకొచ్చాడు. ఆ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా... కలెక్షన్స్ మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. 'ది రాజాసాబ్' సినిమా రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసింది. టాక్ తో సంబంధం లేకుండా ఈ స్థాయి కలెక్షన్స్ రావడానికి పండగ సీజన్ కూడా ఓ కారణమని ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు. అదే సమయంలో ప్రభాస్ కు ఉన్న ఫాలోయింగ్ ను ఈ లెక్కలు చెప్పకనే చెబుతున్నాయని అంటున్నారు.
ఇదిలా ఉంటే... ఈ యేడాది ప్రభాస్ నటించిన మరో సినిమా కూడా జనం ముందుకు రాబోతోంది. మొదటి సినిమా సంక్రాంతి సీజన్ లో వస్తే... ఈ యేడాది రెండో సినిమా దసరాకు బరిలో దిగుతోంది. అది ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'ఫౌజీ' చిత్రం. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) తో కలిసి టి సీరిస్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా పూర్తి అయ్యే వరకూ కంటిన్యూగా షూటింగ్ జరుపుతామని, దసరా కానుకగా అక్టోబర్ రెండోవారంలో మూవీని రిలీజ్ చేస్తామని మేకర్స్ తెలిపారు.
ఎమోషన్, గ్రాండ్యూర్‌కి పేరుపొందిన దర్శకుడు హను రాఘవపూడి, ప్రభాస్‌ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పవర్ ఫుల్ అవతార్ లో చూపించబోతున్నారు. ప్రభాస్ సరసన హీరోయిన్‌గా ఇమాన్వీ (Imanvi) నటిస్తోంది. అనుపమ్ ఖేర్ (Anupam Kher), మిథున్ చక్రవర్తి (Mithun Chakraborty), జయప్రద (Jaya Prada), భాను చందర్ (Bhanu Chandar) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాటోగ్రఫీని సుదీప్ చటర్జీ (ISC) నిర్వహిస్తుండగా, సంగీతాన్ని విశాల్ చంద్రశేఖర్ (Vishal Chandrasekhar) అందిస్తున్నారు. పాటలను కృష్ణకాంత్ రాస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో విడుదల కానుంది.