Prabhas: స్పీడు పెంచిన డార్లింగ్.. ప్రభాస్‌ను ఆపతరమా
ABN , Publish Date - Jan 29 , 2026 | 03:44 PM
సినిమా పూర్తయ్యాక సినిమా అన్న రూల్‌కు ఫుల్‌స్టాప్ పెట్టారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.
సినిమా పూర్తయ్యాక సినిమా అన్న రూల్‌కు ఫుల్‌స్టాప్ పెట్టారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas). దేశవ్యాప్తంగా మంచి మార్కెట్ ఉన్న ఆయన కోసం మేకర్స్ కథలు తయారు చేస్తూనే ఉన్నారు. ఆయన చిత్రాలన్నీ పాన్ ఇండియా కథలతో తెరకెక్కేవే! సంక్రాంతికి ‘ది రాజాసాబ్’ విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆశించిన ఫలితం దక్కించుకోలేకపోయింది. ప్రస్తుతం ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. సెట్స్ మీద రెండు, మూడు చిత్రాలను నడిపిస్తున్నారు. ఏడాదికి రెండు సినిమాలైనా తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభాస్ పని చేస్తున్నారు. అందుకే సినిమా వెనుక సినిమా పెడుతూ పని చేస్తున్నారు.
‘ది రాజాసాబ్’ సినిమాతో బిజీగా ఉన్న సమయంలోనే, ‘కల్కి 2898 ఎ.డి’, ‘ఫౌజీ’ సినిమాలు షురూ చేశారు. రాజాసాబ్ ముందు రిలీజ్ అయింది. ప్రస్తుతం ‘ఫౌజీ’, ‘స్పిరిట్’ సినిమాల చిత్రీకరణ సాగుతుంది. వీటితోపాటు ‘కల్కి2’ సినిమాను పట్టాలెక్కించాలని నిర్ణయించారు. నాగ్ అశ్విన్ కొంతకాలంగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని, దానికి ప్రభాస్ డేట్స్ ఇచ్చానని తెలిసింది. అంటే మళ్లీ మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నట్లే. ది రాజాసాబ్ నిరుత్సాహపరచడంతో ఈసారి వచ్చే సినిమా గట్టిగా హిట్ కొట్టాలని అభిమానులు ఆశపడుతున్నారు.