Powerstar Pawan Kalyan: పవన్ సినిమా రామ్ తాళ్ళూరికే!
ABN , Publish Date - Jan 01 , 2026 | 10:44 AM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో రామ్ తాళ్ళూరి నిర్మించబోతున్న సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో జైత్రరామ మూవీస్ బ్యానర్ లో దీనిని నిర్మిస్తున్నట్టు రామ్ తాళ్ళూరి తెలిపారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరోసారి ఇచ్చిన మాటకు కట్టుబడ్డారు. డిప్యూటీ సీఎం కాకముందు కమిట్ అయిన సినిమాకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రెండేళ్ళ క్రితం పవన్ కళ్యాణ్ హీరోగా సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో మూవీ నిర్మించబోతున్నట్టు ప్రముఖ నిర్మాత రామ్ తాళ్ళూరి (Ram Talluri) ప్రకటించారు. వక్కంతం వంశీ రచన చేస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది. అయితే ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ బిజీ కావడం, ఎన్నికల్లో హండ్రెండ్ పర్సంట్ స్ర్టయికింగ్ రేట్ తో ఘన విజయాన్ని సాధించడం, ఆంధ్ర ప్రదేశ్ కు డిప్యూటీ సీఎం కావడం జరిగిపోయాయి. దాంతో పవన్ కళ్యాణ్ అప్పటికే కమిట్ అయిన 'హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాలను పూర్తి చేయాల్సిన పని పడింది. అధికారం కార్యకలాపాలకు ప్రాధాన్యమిచ్చి, ఆ తర్వాత కమిట్ అయిన సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు పవన్ కళ్యాణ్. అలా ఆయన నటించిన 'హరి హర వీరమల్లు', (Hari Hara Veeramallu) 'ఓజీ' (OG) చిత్రాలు 2025లో వచ్చాయి. హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ నూ పూర్తి చేశారు పవన్ కళ్యాణ్. ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో పవన్ కొత్త సినిమా గురించి రకరకాల ఊహాగానాలు కొంతకాలంగా జరుగుతూ వస్తున్నాయి. వాటికి కొత్త సంవత్సరం తొలిరోజునే ఫుల్ స్టాప్ పెట్టేశారు పవన్ కళ్యాణ్. ఇచ్చిన మాట ప్రకారం పవన్ కళ్యాణ్ దర్శకుడు సురేందర్ రెడ్డికే మూవీ చేయబోతున్నారు. దీన్ని రామ్ తాళ్ళూరి నిర్మించబోతున్నారు. అయితే ఈ సినిమా కోసం కొత్త బ్యానర్ ప్రారంభించినట్టు రామ్ తెలిపారు. ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రామ్ తాళ్ళూరి పవన్ కళ్యాణ్ ప్రేమ, ఆశీస్సులతో 'జైత్రరామ మూవీస్' పేరుతో కొత్త బ్యానర్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ టీమ్ తో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు రావాల్సి ఉంది. ఎప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళుతుంది, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. ఏదేమైనా కొత్త సంవత్సరం తొలి రోజునే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లో నయా జోష్ ను రామ్ తాళ్ళూరి నింపారు.