'పెద్ది' కంప్లీట్.. ఇక చరణ్, సుకుమార్ వేట మొదలు!

ABN , Publish Date - May 01 , 2026 | 11:26 AM

రామ్ చరణ్ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత వేగంగా సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు.

sukumar ram charan

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత వేగంగా సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు. తాజాగా ఆయన నటిస్తున్న పెద్ది (Peddi) షూటింగ్ ఏప్రిల్ 30వ తేదీ నాటికి ఈ సినిమా మొత్తం అధికారికంగా పూర్తయిందని సినీ వర్గాల సమాచారం. గత కొన్ని రోజులుగా రామ్ చరణ్, శ్రుతి హాసన్‌ల కలయికలో ఒక ప్రత్యేకమైన ఐటమ్ సాంగ్‌ను భారీ ఎత్తున చిత్రీకరించారు. ఈ పాటతో పాటు పెండింగ్‌లో ఉన్న ప్యాచ్ వర్క్ పనులన్నీ కూడా విజయవంతంగా ముగిశాయి.

ప్రస్తుతం 'పెద్ది' చిత్ర యూనిట్ దృష్టి మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ పనులపైనే ఉంది. యశ్ హీరోగా వస్తున్న 'టాక్సిక్' సినిమా వాయిదా పడటంతో, ఆ ఖాళీ అయిన జూన్ 4వ తేదీని ఈ సినిమా కోసం లాక్ చేయాలని చిత్ర బృందం యోచిస్తోంది. సమ్మర్ సీజన్ లో వచ్చే సెలవులను ఉపయోగించుకోవడానికి ఈ తేదీ ఎంతో అనుకూలమైనదని మేకర్స్ భావిస్తున్నారు. విడుదల తేదీపై నెలకొన్న సందిగ్ధతకు ముగింపు పలుకుతూ, మరో రెండు రోజుల్లో మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ స్పోర్ట్స్ డ్రామాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక రామ్ చరణ్ పెద్ది విడుదలైన వెంటనే ఏమాత్రం విరామం తీసుకోకుండా తన 17వ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను లెక్కల మాస్టర్ సుకుమార్ తెరకెక్కించనున్నారు. 'రంగస్థలం' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అనౌన్స్‌మెంట్ నుంచే ఈ చిత్రంపై సాటిలేని క్రేజ్ నెలకొంది. 'పెద్ది' చిత్రం జూన్‌లో విడుదల కానుందనే విషయం ప్రతి ఒక్కరికీ ఎరుకే. ఆ సినిమా రిలీజ్ అయిన వెంటనే అదే నెలలో సుకుమార్ చిత్ర షూటింగ్‌లో చరణ్ పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

ఇప్పటికే సుకుమార్ (Sukumar), చరణ్ కోసం ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారట. గత కొద్ది కాలంగా మూడు విభిన్నమైన కథాంశాలను పరిశీలించిన సుకుమార్, చివరికి ఒక అద్భుతమైన కథను ఖరారు చేశారు. మే నెల మధ్యలో రామ్ చరణ్‌కు ఆయన పూర్తిస్థాయి నరేషన్ ఇవ్వనున్నారు. సుకుమార్ తన సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు అలాగే స్క్రిప్ట్ లో అవసరమైన మార్పులు చేస్తూనే ఉంటారు. ఈ ప్రాజెక్ట్ మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై అత్యున్నత సాంకేతిక విలువలలో రూపొందనుంది.

రామ్ చరణ్ ఈ కొత్త చిత్రం కోసం తన మేకోవర్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపించనున్నారు. షూటింగ్ ప్రారంభమయ్యే లోపు ఒక చిన్న విరామం తీసుకుని, సుకుమార్ కథలోని పాత్రకు తగ్గట్టుగా తన బాడీ లాంగ్వేజ్ ను, లుక్స్‌ను మార్చుకోనున్నారు. 'పెద్ది' చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, సుకుమార్ ప్రాజెక్ట్ వివరాలు కూడా త్వరలోనే వెల్లడి కానున్నాయి. మెగా అభిమానులకు రాబోయే రోజులు వరుస అప్‌డేట్లతో పండగలా ఉండబోతున్నాయి.

Updated Date - May 01 , 2026 | 11:44 AM