పవన్‌ కళ్యాణ్‌ క్రేజీ లైనప్‌..

ABN , Publish Date - Feb 24 , 2026 | 07:57 PM

గతేడాది ఓజీ లాంటి మాస్‌ యాక్షన్‌ మూవీతో అభిమానులకు కావాల్సినంత థ్రిల్‌ ఇచ్చిన పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో బిజీ బిజీగా ఉన్నారు.

Pawan Kalyan

గతేడాది ఓజీ లాంటి మాస్‌ యాక్షన్‌ మూవీతో అభిమానులకు కావాల్సినంత థ్రిల్‌ ఇచ్చిన పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఒక వైపు రాజకీయాల్లో ఉంటూనే తన అభిమానుల కోసం సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. ప్రస్తుతం పవన్ చేతిలో ఉన్న ప్రాజెక్టుల గురించి సోషల్ మీడియాలో భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఇద్దరు మాస్ డైరెక్టర్లతో పవన్ చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు మరోసారి తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

'గబ్బర్ సింగ్' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత హరీష్‌ శంకర్ (Harish Shankar), పవన్‌ కళ్యాణ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఉస్తాద్‌ భగత్‌ సింగ్ (Ustaad Bhagat Singh). వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ లో పవన్ మేనరిజమ్స్ చూస్తుంటే, పాత పవర్‌ను మళ్ళీ చూస్తున్నట్లు అనిపిస్తోంది. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.

హరీష్ శంకర్ పవన్ కోసం ఒక పవర్ ఫుల్ పోలీస్ డ్రామాను సిద్ధం చేశారు. ఈసారి కేవలం పెర్ఫార్మెన్స్ మాత్రమే కాదు.. బాక్సాఫీస్ షేకింగ్ కూడా ఉంటుంది అని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి (Surender Reddy) ప్రాజెక్ట్ కూడా ఊపందుకుంది. రామ్ తాళ్లూరి నిర్మాణంలో రానున్న ఈ సినిమా దాదాపు రెండున్నరేళ్ల విరామం తర్వాత పట్టాలెక్కబోతోంది. ఈ చిత్రానికి మాస్ కథా రచయిత వక్కంతం వంశీ (Vakkantham Vamsi) స్క్రిప్ట్ అందించడం విశేషం. జూన్ నెలలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే, ఈ సురేందర్ రెడ్డి సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.

మొదట ప్రభాస్ 'ఫౌజీ' భామ ఇమాన్వీ (Imanvi) పేరు వినిపించినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం సాక్షి వైద్య (Sakshi Vaidya) ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. 'ఏజెంట్' సినిమాతో ఎంట్రీ ఇచ్చి, రీసెంట్‌గా నారీ నారీ నడుమ మురారి సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మకు సురేందర్ రెడ్డి మరోసారి అవకాశం ఇచ్చారు. సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండే అవకాశం కూడా లేకపోలేదు. ఒకవేళ ఇద్దరూ ఉంటే ఇమాన్వీ, సాక్షి వైద్య ఇద్దరినీ పవన్ సరసన చూడటం అభిమానులకు కన్నుల పండగే. ఒకవైపు ఉస్తాద్ గర్జన, మరోవైపు సురేందర్ రెడ్డి స్టైలిష్ యాక్షన్.. పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు రాబోయే రోజుల్లో పండగే పండగ.

Updated Date - Feb 24 , 2026 | 07:57 PM