Pawan Kalyan: కొడుకు హీరోగా.. పవన్ కళ్యాణ్‌ సొంత సినిమా

ABN , Publish Date - Jan 08 , 2026 | 04:09 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు చెందిన 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్' నుండి ఓ వీడియో రిలీజయింది. అది చూసిన ఫ్యాన్స్ ఒక్కొక్కరు ఒక్కోలా భావిస్తున్నారు. ఇంతకూ ఏమిటి సంగతి !?

Pawan Kalyan - Akira

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ బుధవారం 'ఎక్స్'లో పెట్టిన చిన్న వీడియోను చూడగానే పవన్ ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు. ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మార్షల్ ఆర్ట్స్ ను ఇతరులతో కలసి ప్రదర్శించడం కనిపిస్తుంది. అంటే తన రాబోయే చిత్రాన్ని 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్' బ్యానర్ పైనే నిర్మిస్తున్నాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. లేక మార్షల్ ఆర్ట్స్ లో ఈ మధ్య తాను నటించిన 'ఓజీ' (OG) కి కొనసాగింపుగా సీక్వెల్ రూపొందనుందా అనీ కొందరు యోచిస్తున్నారు. 'కరాటేక టు సమురై' అని కూడా టైటిల్ కనిపించడంతో జపాన్ యోధులు 'సమురై' గాథతో ఏదైనా సినిమా రూపొందిస్తున్నారేమో అనీ మరికొందరు భావిస్తున్నారు. వీడియో రిలీజ్ చేయడమే కాదు అందులో 'గెట్ రెడీ టు విట్నెస్ సమ్ థింగ్ హ్యూజ్' అనీ పేర్కొనడం వల్ల ఫ్యాన్స్ రకరకాలుగా యోచిస్తున్నారు.


పవన్ కళ్యాణ్ అభిమాన దర్శకుల్లో జపాన్ దిగ్దర్శకుడు అకిరా కురోసవా ఉన్నారు. ఆయనంటే పవన్ కు ఎంత ఇష్టమంటే తన కొడుక్కి 'అకిరా' (Akira) అని నామకరణం చేసుకున్నారు. అలా మొదటి ఉంచీ అకిరా కురోసవా రూపొందించిన 'సమురై' చిత్రాలను చూసి ఇన్ స్పైర్ అయిన పవన్ కళ్యాణ్ తాను కూడా మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం సంపాదించారు. కొన్ని చిత్రాల్లో వాటిని ప్రదర్శించి మురిపించారు. ఇప్పుడు తన సొంత బ్యానర్ 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్' బ్యానర్ పేరున ఈ 'కరాటేక టు సమురై' వీడియో రిలీజ్ చేశారు. 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్' బ్యానర్ పై పవన్ కళ్యాణ్ ఇప్పటి దాకా రెండు చిత్రాలు నిర్మించారు. అందులో ఒకటి పవన్ హీరోగా బాబీ కొల్లి డైరెక్షన్ లో రూపొందిన 'సర్దార్ గబ్బర్ సింగ్'. ఆ తరువాత పవన్ కళ్యాణ్ కు వీరాభిమానిని అని చెప్పుకొనే నితిన్ హీరోగా తెరకెక్కిన 'చల్ మోహనరంగ' - ఈ రెండు చిత్రాలను పవన్ కళ్యాణ్ ఇతర పార్ట్నర్స్ తో కలసి నిర్మించడం విశేషం. కాగా, రెండు సినిమాలు అంతగా అలరించలేకపోయాయి. మరి ఇప్పుడు అదే బ్యానర్ లో పవన్ సినిమా ఉంటుందా అనే అనుమానాలు పొడసూపుతున్నాయి. కొందరైతే పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా ను హీరోగా పరిచయం చేస్తూ సొంత బ్యానర్ లో సినిమా నిర్మిస్తారనీ ఊహాగానాలు చేస్తున్నారు.


'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్' పతాకంపై 'ఓజీ' సీక్వెల్ ఉంటుందా? లేక ఏదైనా మార్షల్ ఆర్ట్స్ కు సంబంధించిన సిరీస్ రూపొందిస్తారా? అందులో పవన్ నటిస్తారా లేదా? ఇలా పలు విధాలుగా ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' రూపొందుతోంది. ఈ మూవీ వేసవిలో జనం ముందుకు వస్తుందని వినిపిస్తోంది. ఈ లోగా పవన్ తన సొంత బ్యానర్ పై కొత్త సినిమా అనౌన్స్ చేస్తారేమో అన్న ఆసక్తి నెలకొంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఒకే ఒక్క వీడియోతో పలు విధాలా ఆలోచింప చేస్తోంది. తరువాతి రోజుల్లో ఏ అనౌన్స్ మెంట్ వస్తుందో చూడాలి.

Updated Date - Jan 08 , 2026 | 05:40 PM