ఓజీ2లో.. ప్రభాస్ సర్‌ప్రైజ్ ఎంట్రీ? og2తో.. సాహో యూనివర్స్ లింక్!
ABN , Publish Date - Jun 17 , 2026 | 11:00 AM
పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ-2లో ప్రభాస్ సాహో పాత్రతో ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గత కొంత కాలంగా మన సౌత్ సినిమా ఆలోచనా విధానంలో, తెరకెక్కించే విధానంలో భారీ మార్పులు రావడం మనకు స్పష్టంగా కనిపిస్తున్న వాస్తవం. ఒకప్పుడు ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తే.. అదే ఒక పెద్ద పండగ. అలాంటి మల్టీ స్టారర్ సినిమాలతో మొదలైన ఈ సరికొత్త ట్రెండ్.. ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ క్రాస్ ఓవర్స్ వరకు చేరుకుంది. గతంలో తీసిన ఒక బ్లాక్ బస్టర్ సినిమాలోని పాత్రలను, కథను.. కొత్తగా రాబోతున్న మరో సినిమాతో ఇంటర్ లింక్ చేయడం ఇప్పుడు నయా ట్రెండ్. పాత సినిమాలోని స్టార్ హీరోలను సర్ ప్రైజ్ ఎంట్రీగా కొత్త సినిమాలోకి తీసుకువస్తూ థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తున్నారు. ఈ ట్రెండ్ మనకు పాతదే అయినా.. ఈ తరం స్టార్ హీరోలు ఇగోలు పక్కనపెట్టి మరీ ఇలాంటి ప్రయోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం నిజంగా అద్భుతం.
సరిగ్గా చెప్పాలంటే, ఈ క్రాస్ ఓవర్, యూనివర్స్ ట్రెండ్‌ను మన దగ్గర సాలిడ్ గా మొదలుపెట్టింది కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj). విక్రమ్ లాంటి భారీ యాక్షన్ సినిమాలో, కార్తీ ఖైదీ సినిమాను ఇంటర్ లింక్ చేస్తూ ఆయన తెరకెక్కించిన సీన్స్ థియేటర్లలో కూర్చున్న ప్రతి ఒక్కరికీ గూస్ బంప్స్ తెప్పించాయి. ఆ ఒక్క దెబ్బతో సినిమాటిక్ యూనివర్స్ అనే పదానికి సౌత్ ఇండియాలో ఎనలేని క్రేజ్ వచ్చేసింది. ఇప్పుడు సరిగ్గా అలాంటి అద్భుతమైన క్రాస్ ఓవరే టాలీవుడ్ లోనూ రాబోతోంది. ఈ సారి ఆ బాధ్యతను తన భుజాలపై వేసుకుంది మన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) తో బాహుబలి లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సుజిత్ (Sujeeth) తెరకెక్కించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ సాహో. ఈ సినిమా కమర్షియల్ గా భారీ కలెక్షన్స్ రాబట్టినా.. రిలీజ్ టైమ్ లో టాక్ పరంగా మన తెలుగు ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించలేక పోయింది. కానీ, అందులో సుజిత్ రాసుకున్న స్క్రీన్ ప్లే, యాక్షన్ సీక్వెన్సులకు ఇప్పటికీ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అదొక కల్ట్ క్లాసిక్ గా మిగిలిపోయింది. ఇక ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సుజిత్ తెరకెక్కించిన ఓజీ సృష్టించిన సునామీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోనక్కర్లేదు. ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ కు ఏ మాత్రం తగ్గకుండా, పవన్ కళ్యాణ్ ను మునుపెన్నడూ చూడని నెవర్ బిఫోర్ అవతార్ లో ప్రెజెంట్ చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించాడు.
అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఓజీ సినిమాలో సాహో (Saaho) కు సంబంధించిన కొన్ని క్రాస్ ఓవర్ ఎలిమెంట్స్ ను సుజిత్ చాలా తెలివిగా ప్లేస్ చేశాడు. వాజీ సిటీకి, సాహోలోని రాయ్ గ్రూప్‌కు మధ్య ఉన్న ఆ ఇంటర్ లింక్ చూసి అభిమానులు థ్రిల్ అయ్యారు. ఇప్పుడు ఆ చిన్న స్పార్క్ ను.. సుజిత్ భారీగా ప్లాన్ చేస్తున్నట్లు అఫీషియల్ గానే తెలుస్తోంది. రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ ఓజీ-2 పై ఒక సాలిడ్ అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న డైరెక్టర్ సుజిత్ ఇండియాకు తిరిగి రాగానే.. ఓజీ-2 (OG) ప్రీ ప్రొడక్షన్ పనులు, డిస్కషన్స్ మొదలవుతాయని ప్రకటించింది. ఈ అఫీషియల్ అనౌన్స్మెంట్ తో అభిమానుల అంచనాలు అమాంతం తారాస్థాయికి చేరుకున్నాయి.
ఓజీ-2 లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు తోడుగా.. సాహో క్యారెక్టర్ లో ప్రభాస్ కూడా అడుగుపెడితే ఎలా ఉంటుంది..? ఆ ఆలోచనే మెదడును తొలిచేస్తోంది కదూ! సాహోలోని వాజీ సిటీ గ్యాంగ్‌స్టర్ డ్రామాను, ఓజీ లోని గంభీర ఎపిసోడ్‌కు మిక్స్ చేసి సుజిత్ ఒకే సినిమాగా తెరకెక్కిస్తే.. ఆ ఇద్దరు స్టార్స్ ఒకేసారి స్క్రీన్ షేర్ చేసుకుంటే.. థియేటర్లలో పేపర్లు కాదు కదా, ఏకంగా కుర్చీలు కూడా గాల్లోకి లేవడం ఖాయం. పవర్ స్టార్ తో రెబల్ స్టార్.. ఈ ఊహే బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసేలా ఉంది. ఒకవేళ ఇదే ఆచరణ రూపం దాల్చితే.. టాలీవుడ్ హిస్టరీలో కలెక్షన్ల వర్షం ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించడం ఎవరి తరం కాదు. ప్రస్తుతం సుజిత్ ఇదే మాస్టర్ ప్లాన్ తో ఉన్నట్లు ఇన్ సైడ్ టాక్ గట్టిగా వినిపిస్తోంది. మరి ఈ ఇండియన్ బిగ్గెస్ట్ క్రాస్ ఓవర్ ఏ మేర వర్కౌట్ అవుతుందో, ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి!